Tuesday, December 5, 2023

ఆపేక్ష

 పాత పోస్ట్


ఆపేక్ష 04-12-2017


అవి ఎండాకాలం సెలవలు. అంతకు ముందు చెప్పినట్టు...ఆఖరి పరీక్ష వ్రాసి వచ్చిన మధ్యానమే మామ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం.

మేము వెళ్ళేటప్పటికి కొబ్బరి తాడు తో వసారా దూలానికి ఉయ్యాల కట్టి ఉంచేవారు తాతయ్య. ఏడుగురు మనవరాళ్లు, ఇద్దరు మనవళ్లు.


రాత్రి భోజనాలు అయినాక ఆరుబయట మంచాలు వేసుకుని పడుకునేవాళ్ళం.

ఒక పక్కగా మడత మంచం మీద తాతయ్య 

మధ్యలో మామ్మ మంచం చూట్టూ మా మంచాలు...

ఆ రోజుకి ఉన్న స్వపక్షాలు,విపక్షాలు బట్టి మంచాలు మీద జట్లు ఉండేవి...


మొదటి నించి నేను నిశాచరినే...కొంచెం చిన్నప్పుడు అందరు పడుకున్నాక పుస్తకాలు చదువుకునే దాన్ని, 

ఇంటర్మీడియట్   కి వచ్చాక మా మామ్మ ఒక చిన్న పాకెట్ రేడియో ఇచ్చేది....

అందులో  వివిధ భారతిలో రాత్రి 11 గంటలకు "ఆప్ కి ఫార్మయిష్ "అయిపోయినాక ఏ స్టేషన్ పలికితే ఆది వినేదాన్ని.


అప్పట్లో సెల్ ఫోన్లు,మెసేజీలు,వాట్సాప్ లు ఉండేవి కావు కదా....విజయవాడ నించి మా పెద్దవాళ్ళకి ఎవరికి తోస్తే వారు వచ్చేవారు..

శ్రీను బాబాయ్ అయితే ఆఖరి బస్సు కి వచ్చేవాడు..


ఎలాగ తెలిసేదో ఏమో మామ్మకి రెండు రోజుల ముందు నించి  మామ్మకి ఎదో అలాపనగా ఉండేది..


లాస్ట్ బస్ వచ్చే ముందు ఎవరో అమ్మా అని పిలిచారు అని తలుపు తీసి చూసేది...

కానీ ఆశ్చర్యంగా లాస్ట్ బస్ కి బాబాయ్ దిగేవాడు..


అలాగే మేము బయలుదేరి వచ్చేముందు బస్సు దాకా వచ్చి కండక్టర్ కి చిల్లర ఇచ్చేది....

మా అమ్మ వాళ్లకు అయినా అలాగే ఇచ్చేది.


చేరామని ఫోన్ చేస్తే....ఆ బస్ మళ్ళీ ఊరిలోకి వస్తే


 "ఇదిగో ఈ బస్సే గా పిల్లలని తీసుకు వెళ్ళింది అని ఆ బస్ మీద కోపం వచ్చిందే అని నవ్వేది...ఊరికే అనుకోవటమే కానీ,

తప్పదుగా అమ్మ" అనేది


పెళ్లిళ్లు అయ్యి మా సంసారంలో మేము పడ్డాక,ఏదైనా ఫంక్షన్ కి పిల్లలు అందరము వస్తామని విజయవాడ వచ్చి మాతో గడిపి వెళ్ళేది...


మేము బయలుదేరి వస్తుంటే...మళ్ళీ చూస్తానో ,లేనో అన్నట్టు కళ్ళ నిండా నీళ్లు నింపుకొని మమ్మల్ని చూస్తూ ఉండిపోయేది.."

ఎందుకే మామ్మ అంటే...మళ్ళీ మీరు వచ్చినా మీరు నన్ను చూడగలరు  కానీ నేను మిమ్మల్ని చూడగలనో లేదో అనేది."....

ఈ రోజుకి అంతే ఆపేక్షగా పై నించి మమ్మల్ని చూస్తూవుండి ఉంటుంది


మామ్మ  I Love You



Friday, December 1, 2023

భయం వేస్తోంది

 ఏమైనా పరిస్థితి మారిందా?

మెరుగైందా?


భయం వేస్తోంది.02-12-2019


పొద్దున్న పదకొండు గంటల వేళా,హైదరాబాద్ లో ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరైన మీ బండి ఆగినప్పుడు ఆ చుట్టూ పక్కల వైన్ దుకాణము వేపు చూడండి. పాతికేళ్ల  వయస్సు లోపు  పిల్లలు ఎంత మంది ఆ షాప్ పక్కనే ఉన్న షట్టర్ లోకి దూరిపోతు వుంటారో??

మత్తు కోసం పట్టపగలు యువత అలా చూస్తే నాకు చాలా భయం వేస్తుంది..

చాలా సార్లు గమనించినాక చెబుతున్నా.


రాత్రి 7-8 మధ్యలో శివమ్ రోడ్డుపై మీరు వెళ్తుంటే బాగా రద్దీగా ఉండే టైం లో ప్రతి ఐదుగురి తరువాత మనకు ఒకడు తూలుతూ కనపడతాడు.

అప్పుడూ భయం వేస్తుంది.


గ్రాడ్యుయేషన్ ఫ్రెషర్స్ పార్టీలు పబ్ లలో  జరుపుతుంటే....ఇవన్నీ సాధారణం అమ్మ...

పబ్ కి వెళ్లినంతమాత్రనా  తాగినట్టు కాదమ్మ అని కొడుకో/కూతురో మనకు. ధైర్యం చెబుతుంటే మనకు భయం వేస్తుందిగా...


ఆ... ఇవాళ ,రేపూ ఎవరు తాగకుండా వున్నారు??

మనం తాగకపోతే కల్చర్ లేదనుకుంటారు.

ఇలాంటివి వింటే భయం వేస్తోంది..


నీకెందుకమ్మా భయం  

అంత భయపడేదానివి నీ మానాన నువ్వు ఉండక మాకెందుకు అంటారా???


ఎందుకంటే...మద్యం మత్తు తాగినవారినే ముంచదు....చుట్టూ ఉన్నవారికి కూడా చేటే.

నేను రుజువులు చూపించక్కర్లేదుగా


Monday, November 13, 2023

బాలల దినోత్సవం

 చిన్నప్పటి నించి అలవాటు నవంబర్ 14th  బాలల దినోత్సవం. అప్పుడు స్కూల్ సెలవులు, ప్రోగ్రాంలు. అంతే! 


పిల్లలు పుట్టాక బలవంతంగా పెద్ద అవ్వవలసి వచ్చింది😀

కిందపడినా, లేచి దులుపుకుని పరిగెత్తే టైపు మనం. 

అదేమీ జన్మో!

 నిన్నటిది ఈరోజు గుర్తుండదు. జాగ్రత్త,  భయంలాంటివి లేవు. 

మా అమ్మ నేర్పే ప్రయత్నం చేసింది-నేను నేర్చుకోలేదు.

మా నాన్న దేనికి భయపడకూడదు-

తప్పు చేస్తే ఒప్పుకో.

కష్టం వస్తే తట్టుకో అనే నేర్పారు.

భయపడటం నేర్పేలేదు. భగవద్గీత లో మొదటి శ్లోకం చూపించి మరీ నేర్పారు. 


మా మామ్మ ప్రసవం ముందర నెప్పులు వొస్తుంటే "కష్టమే! కానీ తప్పదు. ఓర్చుకో. అమ్మా, అమ్మా కాదు రామా, రామా అనుకో రాముడే గట్టెక్కిస్తాడు"అనేది. అలాగా కష్టాలకు ఓర్చుకుని గెలవడం నేర్పింది కానీ భయపడటం నేర్పలేదు.


అయితే భయాలు లేవా?

బోలెడు. 

ఒంటరితనం భయం. 

చీకటి భయం.

జంతువులంటే భయం. ముఖ్యంగా పిల్లి అంటే భయంతో కూడిన అసహ్యం. 

ఇలాంటి భయాలు మీకూ ఏవో ఒకటి ఉండి  ఉంటాయి కదా.


సరే అసలు విషయానికి వద్దాం. బాలల దినోత్సవం కదా. మా పిల్లలు పుట్టాక పెద్దగా  వుండవలసి వచ్చినా పిల్ల చేష్టలు వాళ్ళతో బాగానే చేశా. చేస్తున్నా. ఎందుకంటే అప్పుడు అమ్మా, నాన్న, బాబాయిలు భరిస్తే ఇప్పుడు అందరివారా మా ఆయన ఒక్కరే భరిస్తారు. మరి తప్పదుగా. అందుకే అన్నారు. 'భర్త అంటే భరించువాడు' అని. అంతమంది వారా ఒక్కడు. పాపం.

తెలుసు. మీ సానుభూతి అంతా ఆయనకే అని. 


సంతోషం ఏమిటంటే ఇంకా పిల్లతనం పోకుండా, మొన్న ఆ మధ్య మా ఆడబడుచుతో ఊరికి వెళ్ళినప్పుడు ఈ గొట్టాలు-మేము వాటిని అలాగా పిలుస్తాము😀 స్టయిలుగా గోల్డ్ ఫింగర్స్ అనము. టీ తాగడం కోసం హైవే మీద కారు అపగానే, ఈ గొట్టాలు పేకెట్ కనపడగానే ఇద్దరమూ  కలిసి ఒకసారి అనుకుని కొనుక్కొని తిన్నాము చూడండి. 

అలాగే ఇంటికి అయిదేళ్ల పిల్లవాడు వచ్చినా వాడితో కూర్చుని అష్టా చెమ్మా ఆడతాను చూడండి.

అప్పుడు మనలోని చిన్న పాపయిని హాయిగా ఉంచినట్టే కదా.


అలాగే ఏదైనా కొత్త పని చేయాలని ఉత్సహం. అది పాడైపోయినా ఏమి ఫర్వాలేదు అనుకుంటూ ఇంకో పని చెయ్యాలని అవకాశం కోసం చూడడం.

కానుకలు ఇవ్వడము, తీసుకోవడం మీద ఇష్టం.

కనిపించిన వారిని వాళ్లే పలకరించాలని లాంటి నియమాలు పెట్టుకోకుండా మనమే పలకరించడం. 

ఏ రోజుకు ఆ రోజు సుదినం అనుకుంటూ సంతోషంగా వుండే ప్రయత్నం చేయడం. ఇవి అన్నీ చిన్నపిల్లల లక్షణాలే. 

ఇవి చేస్తున్నా మనలోని పసితనాన్ని కాపుడుకుంటామని గ్యారెంటీ లేదు.

కానీ ప్రయత్నమే చాలా హాయిగా ఉంటుంది.


అదృష్టం ఏమిటంటే నేను ఇంకా పసిపిల్లను అనుకుని చెప్పేవాళ్ళు ఉండడం. అలాగా కేర్ చేసేవాళ్ళు రోజు రోజుకి ఎక్కువ అవడం. వారికి నా వందనాలు🙏


కింద వీడియోలు చూపించినట్టు గడిచిన రోజు వెనక్కి తీసుకురాలేము. కాబట్టి, ఉన్న రోజున, ఉన్న క్షణాన ఉన్న వారితో సంతోషముగా గడపండి. ఎక్కడ ఉంటే అక్కడే మనవారు అన్న భావం ముఖ్యం. అదే మన తక్షణ కర్తవ్యం. 

అదే మనకు శ్రీ రామ రక్ష.


Friday, November 3, 2023

National Housewife's Day 2023

 National Housewife Day

నవంబర్ 3వ తారీఖునట. నాకూ ఈ రోజే తెలిసింది. 


ఏ వృత్తిలో వున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా పెళ్లై ఇల్లు చక్కదిద్దుకునే ప్రతి స్త్రీ కి National Housewife Day శుభాకాంక్షలు.


హౌస్ వైఫ్ అన్న పదం ఇప్పుడు వాడడం లేదు. మా చిన్నప్పుడు మా పక్కింటి ఆమ్మా ఎప్పుడైనా కోపం వస్తే "మా ఆయన ఈ తాడు నాకు కట్టాడు. నేను ఈ ఇంటికి కట్టాను." అనేది. అప్పుడు అర్థం కాలేదు!


పెళ్లి కాక మునుపు దేవత సినిమాలో 'ఆలయాన వెలిసిన ఈ దేవుని రీతి' పాటను, పాటలోని మన సావిత్రిని చూసి ఇంటి ఇల్లాలంటే అలాగే ఉండాలి అనుకునేదాన్ని. పెళ్ళయాక, ఎంత భర్త సహకారం వున్నా, ఇంటి ఇల్లాలు అంటే దేవత చేసే అంత మేజిక్ కాదు. కాస్త కష్టమైన పనే అని తెలిసి వచ్చింది.


Being an housewife is an endless  and thankless job. Thankless అని ఎందుకు అన్నానంటే మన ఆనందం కోసం తప్పించి, ఎవరి మెచ్చుకోలు కోసమో మనం ఈ పని చేయలేము.


 ఏ వృత్తిలో వున్నా మన ఇంటి గురించి ఆలోచన మనేస్తామా?

ఎంత అందలానికి మన ఒక్కరినే ఎక్కించినా మనతో పాటు వారు లేరే అన్న దిగులు ఉండకుండా ఉంటుందా. 


గత పది సంవత్సరాల వరకు  నేను ఏమి పని చేసినా, designation అంటే housewife అనే వ్రాసేదాన్ని. 

అదే అవ్వ పేరే ముసలమ్మ అని ఇప్పుడు హోమ్ మేకర్ అంటున్నారుగా!


మా పిల్లలు పొట్లాడేవారు. ఎందుకు అలాగా రాస్తావు అని. ఎందుకంటే, ఏమి పని చేసినా, ఇంటి పని, పిల్లల పని అయిపోయినాక ఫ్రీ టైం లోనే కదా. మెయిన్ గా అయితే అదే కదా అని. అంటే అవి అన్ని టైం పాస్ గా అంతే. అయితే ఆ రోజుల్లో నాకు ఎంతో మంది స్ఫూర్తి గా వుండేవారు. మన వదిన కథల Subba Lakshmi G  అంటీ, Vijayalakshmi Pothuri అమ్మా, Rajya Lakshmi Udathu అంటీ. వీరందరు personal గా నేను చూసినప్పుడు వారి వారి జీవితములో house wife గా వారి బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.


అలాగే మా చిన్నతనంలో Aruna Vyas Kota గారు. విజయవాడలో ఆవిడ స్పీచెస్ విన్నప్పుడు అలాగా

మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనుకునేదాన్ని. ఇప్పుడు ఈ ముఖ పుస్తకం లోకి వచ్చాక చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా Jyothi Valaboju గారు ప్రముఖంగా చెప్పుకోవాలి.


అయితే నేను చాలా సంతోషం గా చెప్పుకునే విషయం నేను ఎప్పుడూ ఖాళీగా లేను. నా స్కిల్స్ upgrade చేసుకుంటూనే వున్నాను. దానికి నా భర్త, పిల్లలు ఎంతగానో సహకరించారు.  కానీ ఏ పని చేస్తున్నా, ఇంటి బాధ్యత అయితే ఆడవారిదే గా.


If you are a wife, you are wife to the house also. అదెలాగా? ఇప్పటికన్నా మారదామా? House belongs to everyone who lives in it. Each and every member needs to put in the effort to make it a home.


 కానీ అలాగా జరుగుతుందా? ఈ రోజు ఇంటి ఇల్లాలిని గుర్తుంచి ,వారి ఇంటి కోసం కుటుంబం కోసం పనిని గౌరవించి థాంక్స్ చెప్పాలట. ఈ రోజుని National Housewife's Day గా గుర్తించిన ముఖ్యకారణం అదేనట. 


ఎంత మంది ఆ పని చేయగలరు?

Employees and professionals గా ఉన్న ఆడవారికి ఎక్కువ మందికి double dhamaka నే. వారు ఏ మాత్రం ప్రశాంతంగా చేసుకుంటున్నా they need to thank the whole clan. మరి ఒక మగవాడు తెచ్చి పడితే, ఇంటిల్లిపాదిని, అతిధి సత్కారాలతో సహా చూసే ఆడవారికి ఎంత మంది  ఇంట్లో థాంక్స్ చెబుతున్నారు?


ఎన్ని చేసినా, ఏమి చేసినా చాలామంది ఆడవారి పని భర్త ఇంటికి, పిల్లలకి ట్రస్టీ గా ఉండటమే. అన్నీ వాళ్ళవి లాగానే ఉంటాయి. ఏది  వారిది కాదు.


ఈ being a housewife ఇవి అన్ని ఎంత బాగున్నా, దానికన్నా ముందు మనం మనుష్యులం కాబట్టి మన జీవితానికి ఒక ఆశయం పెట్టుకుని, ఇల్లే ప్రపంచం కాకుండా ఇంటిని గురించే కాకుండా మన గురించి కూడా మనం ఆలోచించుకుంద్దాం. 

మన జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలంటే మన కుటుంబం మీద నెపం పెట్టకుండా మన కోసం కూడా మనం కష్టపడద్దాం. 

ముందు మీరు ఉత్సహం గా వుండండి. అవకాశాలు కల్పించుకోండి.  మీకు ఇష్టమైన పని చేయండి.  గుర్తుంచుకోండి. మనం చేసే పని మీద మన ఇష్టమే మనకు శక్తిని ఉత్సహాన్ని ఇవ్వాలి కానీ, మనలను ఎవరూ చేయపట్టి నడిపించారు. ఒక కుటుంబాన్ని నడపగలిగిన మనం మన కోసం మనం నడవలేమా?

ఈ రోజు మీరు ఏర్పరచే దారి ముందు ముందు ఎంతో మందికి రహదారి అవుతుంది.