చిన్నప్పటి నించి అలవాటు నవంబర్ 14th బాలల దినోత్సవం. అప్పుడు స్కూల్ సెలవులు, ప్రోగ్రాంలు. అంతే!
పిల్లలు పుట్టాక బలవంతంగా పెద్ద అవ్వవలసి వచ్చింది😀
కిందపడినా, లేచి దులుపుకుని పరిగెత్తే టైపు మనం.
అదేమీ జన్మో!
నిన్నటిది ఈరోజు గుర్తుండదు. జాగ్రత్త, భయంలాంటివి లేవు.
మా అమ్మ నేర్పే ప్రయత్నం చేసింది-నేను నేర్చుకోలేదు.
మా నాన్న దేనికి భయపడకూడదు-
తప్పు చేస్తే ఒప్పుకో.
కష్టం వస్తే తట్టుకో అనే నేర్పారు.
భయపడటం నేర్పేలేదు. భగవద్గీత లో మొదటి శ్లోకం చూపించి మరీ నేర్పారు.
మా మామ్మ ప్రసవం ముందర నెప్పులు వొస్తుంటే "కష్టమే! కానీ తప్పదు. ఓర్చుకో. అమ్మా, అమ్మా కాదు రామా, రామా అనుకో రాముడే గట్టెక్కిస్తాడు"అనేది. అలాగా కష్టాలకు ఓర్చుకుని గెలవడం నేర్పింది కానీ భయపడటం నేర్పలేదు.
అయితే భయాలు లేవా?
బోలెడు.
ఒంటరితనం భయం.
చీకటి భయం.
జంతువులంటే భయం. ముఖ్యంగా పిల్లి అంటే భయంతో కూడిన అసహ్యం.
ఇలాంటి భయాలు మీకూ ఏవో ఒకటి ఉండి ఉంటాయి కదా.
సరే అసలు విషయానికి వద్దాం. బాలల దినోత్సవం కదా. మా పిల్లలు పుట్టాక పెద్దగా వుండవలసి వచ్చినా పిల్ల చేష్టలు వాళ్ళతో బాగానే చేశా. చేస్తున్నా. ఎందుకంటే అప్పుడు అమ్మా, నాన్న, బాబాయిలు భరిస్తే ఇప్పుడు అందరివారా మా ఆయన ఒక్కరే భరిస్తారు. మరి తప్పదుగా. అందుకే అన్నారు. 'భర్త అంటే భరించువాడు' అని. అంతమంది వారా ఒక్కడు. పాపం.
తెలుసు. మీ సానుభూతి అంతా ఆయనకే అని.
సంతోషం ఏమిటంటే ఇంకా పిల్లతనం పోకుండా, మొన్న ఆ మధ్య మా ఆడబడుచుతో ఊరికి వెళ్ళినప్పుడు ఈ గొట్టాలు-మేము వాటిని అలాగా పిలుస్తాము😀 స్టయిలుగా గోల్డ్ ఫింగర్స్ అనము. టీ తాగడం కోసం హైవే మీద కారు అపగానే, ఈ గొట్టాలు పేకెట్ కనపడగానే ఇద్దరమూ కలిసి ఒకసారి అనుకుని కొనుక్కొని తిన్నాము చూడండి.
అలాగే ఇంటికి అయిదేళ్ల పిల్లవాడు వచ్చినా వాడితో కూర్చుని అష్టా చెమ్మా ఆడతాను చూడండి.
అప్పుడు మనలోని చిన్న పాపయిని హాయిగా ఉంచినట్టే కదా.
అలాగే ఏదైనా కొత్త పని చేయాలని ఉత్సహం. అది పాడైపోయినా ఏమి ఫర్వాలేదు అనుకుంటూ ఇంకో పని చెయ్యాలని అవకాశం కోసం చూడడం.
కానుకలు ఇవ్వడము, తీసుకోవడం మీద ఇష్టం.
కనిపించిన వారిని వాళ్లే పలకరించాలని లాంటి నియమాలు పెట్టుకోకుండా మనమే పలకరించడం.
ఏ రోజుకు ఆ రోజు సుదినం అనుకుంటూ సంతోషంగా వుండే ప్రయత్నం చేయడం. ఇవి అన్నీ చిన్నపిల్లల లక్షణాలే.
ఇవి చేస్తున్నా మనలోని పసితనాన్ని కాపుడుకుంటామని గ్యారెంటీ లేదు.
కానీ ప్రయత్నమే చాలా హాయిగా ఉంటుంది.
అదృష్టం ఏమిటంటే నేను ఇంకా పసిపిల్లను అనుకుని చెప్పేవాళ్ళు ఉండడం. అలాగా కేర్ చేసేవాళ్ళు రోజు రోజుకి ఎక్కువ అవడం. వారికి నా వందనాలు🙏
కింద వీడియోలు చూపించినట్టు గడిచిన రోజు వెనక్కి తీసుకురాలేము. కాబట్టి, ఉన్న రోజున, ఉన్న క్షణాన ఉన్న వారితో సంతోషముగా గడపండి. ఎక్కడ ఉంటే అక్కడే మనవారు అన్న భావం ముఖ్యం. అదే మన తక్షణ కర్తవ్యం.
అదే మనకు శ్రీ రామ రక్ష.

