Thursday, February 21, 2019

నీడ

ఆ రోజు - ఈ ప్రపంచానికి లభించింది

*******************

అనగనగ అప్పుడెప్పుడో

అనగనగా ఒక ఊరు

ఆ ఊళ్ళో ఒక కుర్రవాడు

అతని పేరు అనాతపుడు

చాలా మంచివాడు

చిన్నప్పుడే తలిదండ్రులను పోగొట్టుకున్నవాడు

యాయవారం చేస్తూ బతుకు వెళ్ళబుచ్చేది

భిక్షలో వచ్చినదానిలోనే తను కాస్త తిని మిగిలిందంతా ఆకలిగా కనపడ్డ కుక్కకు, పిల్లికి, తోటి భిక్షగాళ్ళకు పంచేవాడు

ఆ కుర్రవాడి మంచితనాన్ని చూచి, ఒక చెతి భిక్ష వేసే అమ్మలంతా రెండు చేతుల భిక్ష వేసేవారు

ఆ మంచితనం దేవలోకానికీ పాకిపోయింది

ఇంద్రుడికి ఆసక్తి కలిగి సంగతేమిటో తేల్చి తెలుసుకుందామని వచ్చినాడు

చాటుగా గమనించాడు, ఆశ్చర్యపడ్డాదు అతని దానగుణానికి

మాయరూపంలో వెళ్ళి చాలా ఆకలిగా ఉన్నదన్నాడు

అనాతపుడు తన జోలెలో ఉన్నదంతా తీసి ఇచ్చివేశినాడు

అంతా నాకిచ్చేస్తే నీకో అని ప్రశ్న వచ్చె దేవరాజు నుండి

అయ్యా మీ ఆకలి తీరితే చాలు, నా ఆకలి తీరినట్టేనని సమాధానం వచ్చింది

ముగ్ధుడైపోయినాడు రాజరాజు, దేవరాజు - ఇక ఆయన తలచుకుంటే కొదవేమి

వరమివ్వటానికి తయారయినాడు

అబ్బాయి - నీ మంచితనాన్ని మెచ్చినాను, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు

అయ్యా, మీరెవరు అని అడిగె అనాతపుడు

ఇందాక ఆకలి వేస్తున్నదంటే నాకు నీదగ్గరున2014ా ఇచ్చివేసినప్పుడు బిచ్చగాణ్ణి, నీ మంచితనం చూశాక ఆనందించాక ఇప్పుడు ఇంద్రుణ్ణి అన్నాడు

ఓ ఇంద్రులవారా అని ఒక నమస్కారం పెట్టి మరల తన భిక్షాటనకు బయలుదేరినాడు

ఆగు - అలా వెళ్ళిపోతావేమిటి ? వరం వద్దా? అంతా దానం చేసినావుగా అనె ఇంద్ర

అయ్యా, అది దానమని నేననుకోవటల్లేదు, తోటి మనిషి ఆకలితో అలమటించి పోతుంటే నేను చేయగలిగిన చిన్న సాయమనుకున్నాను అన్నాడు అనాతపుడు

అది దానం కిందకే వస్తుంది, నీకు ఋణగ్రస్తుడనైపోయినాను. అందువల్ల వరమిచ్చేసి తీర్చేసుకోవాలి అన్నాడు దేవరాజు

నాకేమీ అక్కరలేదు అనె అనాతపుడు

కాదు కాదు నువ్వు వరం కోరుకోవాల్సిందే అని ఇంద్రుడు స్వరము పెంచినాడు

అయ్యా అంత కోపమెందులకు, సరే మీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి - నాకు నేను చేస్తున్నాననే విషయం తెలియకుండానే ప్రపంచంలో అందరికీ మేలు చెయ్యగలగాలి - అది ప్రసాదించండి చాలు అని నమస్కారం పెట్టినాడు

ఇంద్రుడికి అట్లాటి వరం ఎలాగివ్వాలో అర్థం కాలా

పంచభూతాలను పిలచినాడు, అష్టదిక్పాలకులను పిలచినాడు

దర్బారు పెట్టినాడు

సంగతి చెప్పినాడు

అరె ఇది చాలా చిక్కుగా ఉన్నదని అంతా తర్జనభర్జన పడినారు

ఇంతలో సూర్యుడు వచ్చినాడు

సంగతి చెప్పినారు

ఆయనన్నాడు - ఇది చాలా సులభంగా పరిష్కరించొచ్చయ్యా, ఇదిగొ ఇలా చెయ్యండి అని వెళ్ళిపోయినాడు

ఇంద్రుడు ఇదేదే బాగుందని అలాగే వరమిచ్చి వెళ్ళిపోయినాడు

ఆ రోజు మొట్టమొదటి "నీడ" ఈ ప్రపంచానికి లభించింది

ఇంతకీ సూర్యుడన్నదేమంటే - ఆయనకు ఓ నీడను జతచెయ్యండి. ఆయనకు కాకుండా ఆ నీడకు అన్ని శక్తులిచ్చెయ్యండి. ఆయన నీడ పడగానే ఆ నీడ పడ్డ ప్రాణిగాని, వస్తువుగాని - దాని దుఖాలు, క్లేశాలు, కష్టాలు, కన్నీళ్ళు నాశనమైపోయేట్టు వరమిచ్చెయ్యండి అని

తన నీడతో అనాతపుడు తనకు తెలియకుండానే ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేసి ఈ లోకం విడిచి వెళ్ళిపోయి స్వర్గంలో ఇంద్రుణ్ణి కలుసుకొని - అయ్యా, నేనొచ్చేసాక, మంచి పనులన్నీ ఆగిపోయినాయి, నాకిచ్చినట్టే మనుషులందరికీ నీడను జత చెయ్యండి. అంతా మంచే జరుగుతుందని ప్రాధేయపడి మొత్తానికి మనుషులందరికీ నీడ జత చేయించినాడు

-- ఆ మంచి చేసే రోజుల నుంచి ఈరోజు తన నీడను చూచి తనే భయపడే స్థాయికి వచ్చేసిన మానుష జాతికి అనాతపుడి అవసరం ఎంతో ఉన్నది...
-- అనాతపము అన్న పదం నీడకు ప్రత్యామ్నాయంగా ఒక పిట్టకథలో వాడినాక వచ్చిన ఆలోచనతో రాసుకొన్న మరొక పిట్ట కథ
-- ఫిబ్రవరి 17, 2014By Vamsi maganti

విధి

గంటలు మోగిపోతాయ్, ఆ తర్వాత బద్దలైపోతాయ్

*********************

అనగనగ

అనగనగ ఒక ఊరు

ఆ ఊళ్ళో ఒక తాత, ఒక మనవడు

తాత ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారాది విద్యల్లో దిట్ట

కుర్రవాడు కాస్త పెద్దగయినాక ఇంద్రజాల విద్యను నేర్పినాడు

కుర్రవాడు అందిస్తే అల్లుకుపోయేవాడు కావటం వల్ల బాగా నేర్చుకున్నాడు

ఇద్దరూ కలిసి ఆ విద్యలతో కాలం గడిపి డబ్బులు బాగా సంపాదించారు

డబ్బులతో పాటు సుఖాలు భోగాలు అలవాటయినవి

కాలం పరుగులు తీస్తున్నది

ముసలి తాత మరింత ముసలి అయినాడు

ఈ లోకాన్ని విడిచే రోజు దగ్గరకొచ్చింది

జబ్బు పడ్డాడు

యముడు వచ్చే సమయం ఆసన్నమయ్యింది

అది చూచి మనవడు దిగులుపడ్డాడు

తాతా నువ్వు నన్ను వదిలివెళ్ళటానికి లేదు, నీ సంగతి నే చూసుకుంటానని యమధర్మరాజుని బురిడీ కొట్టిచ్చటానికి ఉపాయం పన్నినాడు

ఇంద్రజాలంతో ఊళ్ళోని ఒక ఇరవైమంది తాతలను తన తాతలా కనపడేట్టు చేసినాడు

సమయం వచ్చినది

యమధర్మరాజు వచ్చినాడు

ఒక్క సారిగా ఒకే రూపంలో ఉన్న ఇరవైమందిని చూసి ఆశ్చర్యపడినాడు

ఎవరిని తీసుకొనిపోవాలో ఒక నిమిషం అర్థం కాలా ఆయనకు

ఇదేమి గొడవరా నాయనా అనుకుంటూ ఆ మహాదేవుడి వద్దకు పరుగులిడినాడు

ఆయన అటు, ఈ మనవడు బయటకు విజయగర్వంతో నడచినారు

యముడు మహాదేవుడి పాదాల వద్ద కూర్చొని సంగతి చెప్పి ఏం చెయ్యాలో తోచట్లేదని బావురుమనినాడు

బిడ్డా, ఏడుపు ఆపుము, నీవు చేయవలసినది ఇది అని మహాదేవుడు యముణ్ణి కిందకు పంపించినాడు

మహిషపు గంటలు వినపడగానే తాతకు మరల పై ప్రాణాలు పైనే పోయినాయ్

ముసలోళ్లందరినీ గుంపు చేసేలోపల వచ్చేశాడు యముడు

మొత్తానికి ఇరవైమంది ముసలోళ్ళు ఓ చోట నిలబడినారు

యముడు చిరునవ్వు నవ్వినాడు

నవ్వి ఇలా అనినాడు - తాతా, చాలా తెలివి కలవాడివి. కానీ ఒక్క విషయంలో పొరబడి తప్పు చేశినావు. అదే ఇప్పుడు నిన్ను పట్టించింది అని

ఆ తప్పు పొరబాటు చేశినాను అన్న మాట వినగానే అసలు తాత గబగబ దేక్కుంటూ బయటకు వచ్చి ఏమిటా తప్పు అనినాడు

ఇదే, ఈ బయటకు రావటమేనని - గంట వాయించి ముసలివాడిని లాక్కొనిపోయినాడు

అలా విధిని, ధర్మాన్ని మోసం చెయ్యాలని చూస్తే - గంటలు మోగిపోతాయ్, ఆ తర్వాత బద్దలైపోతాయ్

ఓం తత్ సత్

-- మార్చి 21, 2014
-- forwarded

Friday, February 15, 2019

ఉగ్రవాదం

ఉగ్రవాదం
వీర్రాజు ఒక బిల్డర్ దగ్గర సూపరువైసరుగా పని చేస్తున్నాడు.వర్కర్లు ఎంత మంది వచ్చారు, వారు రోజు ఏమి పని చేస్తున్నారు,కూలి బట్వాడా అతని పనులు.

ఒక రెండు సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి.ఏడాది పాప. ప్రస్తుతం చేస్తున్న సైటు దగ్గరే వసతిగా ఇల్లు దొరకడముతో ఈ కొత్త ఇంటికి మారి ఆరు నెలలు అయ్యింది.

మాములుగా బాధ్యతగా ఉండి తన పని చూసుకుని ఇంట్లో భార్య పిల్లలతో కాలక్షేపం చేసేవాడు.

ఎప్పుడైనా స్నేహితులు బలవంతం మీద సారా తాగేవాడు. అటువంటివాడిలో గత నాలుగు నెలలుగా మార్పు గమనించింది అతని భార్య చంద్రిక.

అంతకుముందు అడపాదడపాగా ఉన్న అలవాటు ఇప్పుడు ఇంచుమించి రోజుగా మారింది.

రెండు నెలలుగా ఇంట్లో జీతం ఇవ్వడం లేదు.
 జాగ్రత్తగా వుండే మనిషి కాబట్టి తన దగ్గర దాచిన డబ్బుతో ఇల్లు నడుపుతోంది. కానీ జీతం ఏమి చేస్తున్నాడు అని ఒక రోజు అడిగితే ఇంకా రాలేదు అని సమాధానం చెప్పాడు.

వారం రోజుల నించి మధ్యాన్నం భోజనానికి వచ్చినప్పుడే మనిషి దగ్గర సారా వాసన వస్తోంది.
ఇంక చెప్పక్కర్లేకుండానే జీతం ఏమౌతుందో చంద్రికకు అర్ధం అయింది. నయాన నచ్చచెప్పింది..పిల్ల ఉన్నది,ఇల్లు ఒళ్ళు గుల్ల అవుతుంది.వద్దని.
నిజమే...ఇంకా తాగను అని ఒప్పుకున్నాడు వీరాజు..
కానీ షరా మాములు..మధ్యాన్నం తాగి వస్తున్నాడు.
అదేమి అంటే ఆ కల్లు కాంపౌండ్ కి వచ్చేదాకా బానే ఉంటున్నా...అక్కడికి వచ్చే సరికి కాళ్లు ఆటు వెళ్లిపోతున్నాయి అన్నాడు..

అసలు ఇంతలాగా అలవాటు ఎందుకు అయ్యింది అని నిలదీస్తే..
ఎన్నికల హడావిడిలో నెలరోజులుపాటు తాగినవాళ్ళకి తాగినంత పోయించారు నాయకులు...
అప్పుడే అది వ్యసనమై నెత్తి మీద మహమ్మరి అయ్యింది..

నెత్తి నోరు కొట్టుకు చెప్పింది...
కల్లు కాంపౌండ్ దారి కాక వేరే దారిలో వస్తానన్నాడు...జీతం ఇంటికి తెస్తానన్నాడు
నిజమని  నమ్మింది వెర్రిది..
మళ్ళీ మధ్యాహ్నం తాగివచ్చాడు..
జీతం ఏది అని అడిగింది..
సారకొట్టు వాడి బాకీ జమ వేశానన్నాడు
కోపం వచ్చింది చంద్రికకు...
పుట్టింటికి పోతా అంది...
పోతే పో..అన్నాడు
మళ్ళీ రాను అన్నది..
అక్కడే చావు అన్నాడు.
ఇక్కడే చస్తా అన్నది
చావు...బెదిరిస్తున్నవా అని ఎగతాళి చేసి మత్తుగా పడుకుండిపోయాడు వీర్రాజు..
ఆవేశం,ఉక్రోషం పట్టలేక కిరసనాయిలు పోసుకుని నిప్పు అంటించుకుంది చంద్రిక.
అప్పుడే నిద్ర లేచిన ఏడాది పాప అమ్మను వెతుక్కుంటూ వెళ్లి కాళ్ళను పట్టుకుంది...
గుర్తొచ్చిన పేగుబంధం కేకలు పెట్టింది..వీర్రాజు కి ఇంకా మత్తు వదలలేదు..
పక్కింటివారికి కేకలు వినపడి,వచ్చి  నీళ్లు గుమ్మరించేటప్పటికి పాప లేత చర్మం అంటుకుపోయింది.
ఇంకో బకెట్ నీళ్లు వీర్రాజు మీద గుమ్మస్తే మత్తుదిగింది.

వాస్తవం లోకి వచ్చేటప్పటికి పసిపాప మోర్చురీ లో,
 కోరి చేసుకున్న భార్య ఐ.సి.యూ.లో...
పోలీస్ వచ్చి ఎఫ్.ఐ.ర్. వ్రాయబోతే. స్టవ్ పేలింది అని వాంగ్మూలం ఇచ్చింది..
పిచ్చి తల్లీ...

ఈ చిచ్చు ఎవరు పెట్టింది?
ప్రభుత్వాలు తమ ఆదాయం సారకొట్లు పెట్టటము,
నాయకులు తమ ఓట్ల కోసం వీళ్ళని మత్తులో ముంచడం
జీవితాలు కొల్పుతున్నా తెలుయని నిర్భాగ్యులు...
ఇది ఏ  ఉగ్రవాదం కన్నా తక్కువ???
దేశములో జవాన్లు ప్రాణాలైనా,పేదవాడి ప్రాణాలైన నాయకుల చేతిలో బలి కావలసిందేనా???

(ఇవాళ జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా వ్రాసింది)

Tuesday, February 12, 2019

రధసప్తమి 2019

I AM NOT COMING TODAY EVENING BECAUSE OF I VENT TO YADADRI TEMPLE I WILL COME TO MARROW MORNING -నిన్న సాయంత్రం వచ్చిన మెసేజ్..మొదలు కోపం వచ్చినా I will come tomorrow morning...అన్న మాటలు రేపటి ఉదయం గురించి ఆశ నింపింది పొద్దున్నే వుండే హడావిడికి తోడు రధసప్తమి ... మనం మర్చిపోకున్నా...అందరూ రధసప్తమి శుభాకాంక్షలతో గుర్తు చేసేశారు... వారి స్ఫూర్తి, నిన్నటి ఆశ తో ఉత్సహం గా శుభోదయం...
5.30....తలుపు తట్టిన శబ్దం రాలేదు... రాత్రి లేట్ అయ్యిందేమో . 6.30...పక్కింటికి వెళ్లి వస్తుందేమో ఆమె ఎంప్లాయీ కదా... 7.00...పిల్లకోసం పెడ్తూ,వేడి వేడి ఇడ్లిలు కూడా వేసి రెడి పెట్టా, రాగానే తింటుంది.. 7.20....ఆటో వచ్చింది..అమ్మాయి స్కూల్ కి వెళ్ళింది.. 7.30... ఇడ్లిలతో పాటు ఉత్సహం చల్లారగా, ఆశ చావక ఫోన్ చేశా...ఎప్పటిలానే 'అందుబాటులో లేరు' అదేమిటో మన ఇంట్లో వున్నప్పుడు తెగ ఫోన్లు వస్తూవుంటాయి....మనం అవసరమై చేసినప్పుడు "ఒకే మాట-ఒకే బాణం' టైప్ లో వినపడుతోంది
7.32.. ఇప్పుడే అమ్మాయిని స్కూల్ పంపించి కష్టపడ్డాను కదా,రిలాక్స్ అవుదామని ఇంస్టాగ్రామ్ తెరిచా
7.33..."సాహసమే చేయరా ఢింబక " అని బాలుగారి గొంతు ఉద్భోధ(అది నా ఫోన్ రింగ్ టోన్)..
ఫోన్ తీసా...ఒక మగ గొంతు.. ."అమ్మా,సాయంత్రం వస్తుందమ్మా," "అదేంటి ఇవాళ పండుగ,పైగా పరీక్షలు ,రోజూ రమ్మని చెప్పానే" "అవున్నమ్మ,మీరు చెప్పారట...కానీ ఫంక్షన్ కి వచ్చి ఉండిపోయాము ,సాయంత్రం వస్తుంది" అంతే ఫోన్ కట్ అయ్యింది. నాకు ఆవేశం కట్టలు తెంచుకుంది...😬
ఫోన్ స్క్రీన్ వేపు చూస్తే కనపడింది ఇది...👇కింద బొమ్మ చూడండి😥 Yes, Peace Peace🕊️  అని బుద్ధిగా లెంపలు వేసుకుని,
అందుకేనెమో ఓంకారన్నయ్య' సిక్స్త్ సెన్స్' లాగా నా సిక్స్త్ సెన్స్ కూడా నిన్నటి నించి "రేపు కాలేజ్ కి వెళ్లకు" అని ఒకటే పోరు.
ఈ బాధ,కసి,కోపం ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు....అందుకే మార్క్ నే ఇచ్చాడు గోడ ఒకటి, ఇంకా నాకేల....అని నా గోడుని గోడ ఎక్కించి..
కాసేపు సూరయ్యని ఆగమని (మాకు ఇంకా మబ్బుగా ఉంది😊) వేడుకుని రెడిగా పెట్టుకున్న నాయనమ్మ కుంపటి,అమ్మ ఇచ్చిన ఇత్తడి గిన్నె కాసేపు పక్కన పెట్టి స్వచ్చ్ భారత్ చేసుకుని... మళ్ళీ రధసప్తమి వేడుకల తో వస్తానే... అన్నట్టు మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు😃
మా P.M. అదే మా పనిమనిషి గుడ్ గర్ల్ లాగా సాయంత్రం వచ్చేసింది.
కానీ పొద్దున్న నిదోరోతున్న నా ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపింది...ఆమె మీద నేను ఆధారపడి లేను..అవసరమైతే నా ఇంటి పని నేను చేసుకోగలను అని. ఇక రధసప్తమి గురించి...
రధసప్తమి అనగానే నాకు గుర్తువచ్చేది ఆకాశం ఏమాత్రం కనపడని విజయవాడ వన్ టౌన్ లోని మా ఇంట్లో దొడ్లో కుంపటి పెట్టి దాని మీద సంక్రాంతి కి పెట్టిన గొబ్బి పిడకలు పెట్టి పాలు పొంగించి చిక్కుడు ఆకులలో పరమాన్నం నైవేద్యం పెట్టేది. నాకు రధసప్తమి అంటే ఎందుకో చాలా ఇష్టము.
ఈ రోజు పాలు పొంగించడం కోసమే నేను మా నాయనమ్మ దగ్గర కుంపటి తెచ్చుకున్నా..
మా అమ్మ ఇచ్చిన ఇత్తడి గిన్నె,నందిని వారి ఆవుపాలు, సిద్ధం చేసుకున్నా.
కుంపటి అంటించి ,దానిని మళ్ళీ ఇలాంటి విసనకర్ర తోనే విసరాలి...దానికి కర్ర ఉండకూడదు..అప్పుడే చిన్నప్పుడు పెరవల్లో కుంపటి ఫీలింగ్ వస్తుంది.
పాలు మూడుసార్లు పొంగించి, ఇంట్లో అందరి పేర్లు చెప్తూ బియ్యం వేసి,పరమాన్నం చేసి వాటితో పాటు పొట్టు మినప్పప్పు గారెలు నైవేద్యం పెట్టా.. పాలు పొంగించడములో మనం స్పెషలిస్ట్ కదా.
అందులో బాగా ఎక్స్పర్ట్ అయ్యి కిటుకులు తెలిసి లీటర్ పాల గిన్నెలో అర లీటర్ పాలు పెడతా... అప్పుడు పాలు మరుగుతాయి కానీ పొంగవు అన్న మాట.
పొంగిన పాలు,పొయ్యి,గట్టు తుడుచుకోవడం కన్నా పాలు కోవ అవడం బెటర్ కదా..
ఎప్పుడూ పొంగపెట్టే పాలు ఈ రోజు ఆఫీషల్ గా పొంగిచవచ్చు😛అందుకే నాకు రధసప్తమి అంటే ఇష్టం. పాలు పొంగించాక ఆ కుంపటి మీద టీ పెట్టాను. ఏడాది కి ఒక రోజు ఇలాగ...చాలా బావుంటుంది ఇలాగా నెమ్మదిగా మరిగిన టీ. కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి..
ప్రపంచమంతా తన కాంతిని ప్రసారింపచేసి మనల్ని కాచే దేవుడు.
మన కోసం మనం ప్రార్ధించుకుంటూ "లోకాసమస్త సుఖినోభవంతు" అంటూ ఆ పాలు పొంగినట్టు అందరికి సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రార్ధిస్తున్నా
రధసప్తమి నోములు 
రధసప్తమి నాడు నోములు పడతాము..ఆ రోజు కుదరకపోతే శివరాత్రి నాడు పడతారు.
పెళ్లయిన కొత్తలో పూతాంబూలం, పండుతాంబూలం,పదహారు ఫలాలు నోము పట్టాను.
పూర్తి చేశాను.
అనుకోకుండా కైలాసగౌరి నోము,గ్రామ కుంకుమ నోము చేసుకునాను.
ఆ తరువాత ఆరోగ్యం బావుండక ఇంకేమి ఏమి నోము పట్టలేదు.
మా అమ్మ చాలాసార్లు చెప్పింది" చిన్న చిన్న నోములు పట్టుకో "అని
కానీ అసలే కుదురు తక్కువ..పైగా ఆరోగ్యం బావుండకపోవడంతో ఒకటే నిర్ణయిచుకున్నా..
అదే మా అమ్మకు చెప్పా...
"నా పిల్లలు ఇద్దరు బాగా చదువుకుని మంచిగా జీవితంలో స్థిరపడితే అదే పెద్ద నోము"అని. అప్పుడు పరిస్థితి అది.
గడపలోకి వచ్చినవారిని సరిగా చూసుకుంటే అదే పెద్ద నోము అనుకుంటున్నాను. Kamala Parachaగారు తను పట్టిన నోముల గురించి ఒక పుస్తకము వ్రాసారు. మా పెద్దచెల్లి భలే బాగా పడుతుంది..
మా పక్కన ఆవిడ ఎంప్లాయీ అయినా ఆవిడకు భలే ఇంటరెస్టు.. కనీసం సంవత్సరానికి రెండు నోములు అయినా పడుతుంది..
ఇంతకీ మీరేం నోము పట్టారు??
Disclaimer: The opinions expressed in this post are the personal views of the author. They do not necessarily reflect the views of Momspresso.com (formerly mycity4kids). Any omissions or errors are the author's and Momspresso does not assume any liability or responsibility for them.