I AM NOT COMING TODAY EVENING BECAUSE OF I VENT TO YADADRI TEMPLE I WILL COME TO MARROW MORNING -నిన్న సాయంత్రం వచ్చిన మెసేజ్..మొదలు కోపం వచ్చినా I will come tomorrow morning...అన్న మాటలు రేపటి ఉదయం గురించి ఆశ నింపింది పొద్దున్నే వుండే హడావిడికి తోడు రధసప్తమి ... మనం మర్చిపోకున్నా...అందరూ రధసప్తమి శుభాకాంక్షలతో గుర్తు చేసేశారు... వారి స్ఫూర్తి, నిన్నటి ఆశ తో ఉత్సహం గా శుభోదయం...
5.30....తలుపు తట్టిన శబ్దం రాలేదు... రాత్రి లేట్ అయ్యిందేమో . 6.30...పక్కింటికి వెళ్లి వస్తుందేమో ఆమె ఎంప్లాయీ కదా... 7.00...పిల్లకోసం పెడ్తూ,వేడి వేడి ఇడ్లిలు కూడా వేసి రెడి పెట్టా, రాగానే తింటుంది.. 7.20....ఆటో వచ్చింది..అమ్మాయి స్కూల్ కి వెళ్ళింది.. 7.30... ఇడ్లిలతో పాటు ఉత్సహం చల్లారగా, ఆశ చావక ఫోన్ చేశా...ఎప్పటిలానే 'అందుబాటులో లేరు' అదేమిటో మన ఇంట్లో వున్నప్పుడు తెగ ఫోన్లు వస్తూవుంటాయి....మనం అవసరమై చేసినప్పుడు "ఒకే మాట-ఒకే బాణం' టైప్ లో వినపడుతోంది
7.32.. ఇప్పుడే అమ్మాయిని స్కూల్ పంపించి కష్టపడ్డాను కదా,రిలాక్స్ అవుదామని ఇంస్టాగ్రామ్ తెరిచా
7.33..."సాహసమే చేయరా ఢింబక " అని బాలుగారి గొంతు ఉద్భోధ(అది నా ఫోన్ రింగ్ టోన్)..
ఫోన్ తీసా...ఒక మగ గొంతు.. ."అమ్మా,సాయంత్రం వస్తుందమ్మా," "అదేంటి ఇవాళ పండుగ,పైగా పరీక్షలు ,రోజూ రమ్మని చెప్పానే" "అవున్నమ్మ,మీరు చెప్పారట...కానీ ఫంక్షన్ కి వచ్చి ఉండిపోయాము ,సాయంత్రం వస్తుంది" అంతే ఫోన్ కట్ అయ్యింది. నాకు ఆవేశం కట్టలు తెంచుకుంది...😬
ఫోన్ స్క్రీన్ వేపు చూస్తే కనపడింది ఇది...👇కింద బొమ్మ చూడండి😥 Yes, Peace Peace🕊️ అని బుద్ధిగా లెంపలు వేసుకుని,
అందుకేనెమో ఓంకారన్నయ్య' సిక్స్త్ సెన్స్' లాగా నా సిక్స్త్ సెన్స్ కూడా నిన్నటి నించి "రేపు కాలేజ్ కి వెళ్లకు" అని ఒకటే పోరు.
ఈ బాధ,కసి,కోపం ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు....అందుకే మార్క్ నే ఇచ్చాడు గోడ ఒకటి, ఇంకా నాకేల....అని నా గోడుని గోడ ఎక్కించి..
కాసేపు సూరయ్యని ఆగమని (మాకు ఇంకా మబ్బుగా ఉంది😊) వేడుకుని రెడిగా పెట్టుకున్న నాయనమ్మ కుంపటి,అమ్మ ఇచ్చిన ఇత్తడి గిన్నె కాసేపు పక్కన పెట్టి స్వచ్చ్ భారత్ చేసుకుని... మళ్ళీ రధసప్తమి వేడుకల తో వస్తానే... అన్నట్టు మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు😃
మా P.M. అదే మా పనిమనిషి గుడ్ గర్ల్ లాగా సాయంత్రం వచ్చేసింది.
కానీ పొద్దున్న నిదోరోతున్న నా ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపింది...ఆమె మీద నేను ఆధారపడి లేను..అవసరమైతే నా ఇంటి పని నేను చేసుకోగలను అని. ఇక రధసప్తమి గురించి...
రధసప్తమి అనగానే నాకు గుర్తువచ్చేది ఆకాశం ఏమాత్రం కనపడని విజయవాడ వన్ టౌన్ లోని మా ఇంట్లో దొడ్లో కుంపటి పెట్టి దాని మీద సంక్రాంతి కి పెట్టిన గొబ్బి పిడకలు పెట్టి పాలు పొంగించి చిక్కుడు ఆకులలో పరమాన్నం నైవేద్యం పెట్టేది. నాకు రధసప్తమి అంటే ఎందుకో చాలా ఇష్టము.
ఈ రోజు పాలు పొంగించడం కోసమే నేను మా నాయనమ్మ దగ్గర కుంపటి తెచ్చుకున్నా..
మా అమ్మ ఇచ్చిన ఇత్తడి గిన్నె,నందిని వారి ఆవుపాలు, సిద్ధం చేసుకున్నా.
కుంపటి అంటించి ,దానిని మళ్ళీ ఇలాంటి విసనకర్ర తోనే విసరాలి...దానికి కర్ర ఉండకూడదు..అప్పుడే చిన్నప్పుడు పెరవల్లో కుంపటి ఫీలింగ్ వస్తుంది.
పాలు మూడుసార్లు పొంగించి, ఇంట్లో అందరి పేర్లు చెప్తూ బియ్యం వేసి,పరమాన్నం చేసి వాటితో పాటు పొట్టు మినప్పప్పు గారెలు నైవేద్యం పెట్టా.. పాలు పొంగించడములో మనం స్పెషలిస్ట్ కదా.
అందులో బాగా ఎక్స్పర్ట్ అయ్యి కిటుకులు తెలిసి లీటర్ పాల గిన్నెలో అర లీటర్ పాలు పెడతా... అప్పుడు పాలు మరుగుతాయి కానీ పొంగవు అన్న మాట.
పొంగిన పాలు,పొయ్యి,గట్టు తుడుచుకోవడం కన్నా పాలు కోవ అవడం బెటర్ కదా..
ఎప్పుడూ పొంగపెట్టే పాలు ఈ రోజు ఆఫీషల్ గా పొంగిచవచ్చు😛అందుకే నాకు రధసప్తమి అంటే ఇష్టం. పాలు పొంగించాక ఆ కుంపటి మీద టీ పెట్టాను. ఏడాది కి ఒక రోజు ఇలాగ...చాలా బావుంటుంది ఇలాగా నెమ్మదిగా మరిగిన టీ. కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి..
ప్రపంచమంతా తన కాంతిని ప్రసారింపచేసి మనల్ని కాచే దేవుడు.
మన కోసం మనం ప్రార్ధించుకుంటూ "లోకాసమస్త సుఖినోభవంతు" అంటూ ఆ పాలు పొంగినట్టు అందరికి సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రార్ధిస్తున్నా
రధసప్తమి నోములు
రధసప్తమి నాడు నోములు పడతాము..ఆ రోజు కుదరకపోతే శివరాత్రి నాడు పడతారు.
పెళ్లయిన కొత్తలో పూతాంబూలం, పండుతాంబూలం,పదహారు ఫలాలు నోము పట్టాను.
పూర్తి చేశాను.
అనుకోకుండా కైలాసగౌరి నోము,గ్రామ కుంకుమ నోము చేసుకునాను.
ఆ తరువాత ఆరోగ్యం బావుండక ఇంకేమి ఏమి నోము పట్టలేదు.
మా అమ్మ చాలాసార్లు చెప్పింది" చిన్న చిన్న నోములు పట్టుకో "అని
కానీ అసలే కుదురు తక్కువ..పైగా ఆరోగ్యం బావుండకపోవడంతో ఒకటే నిర్ణయిచుకున్నా..
అదే మా అమ్మకు చెప్పా...
"నా పిల్లలు ఇద్దరు బాగా చదువుకుని మంచిగా జీవితంలో స్థిరపడితే అదే పెద్ద నోము"అని. అప్పుడు పరిస్థితి అది.
గడపలోకి వచ్చినవారిని సరిగా చూసుకుంటే అదే పెద్ద నోము అనుకుంటున్నాను. Kamala Parachaగారు తను పట్టిన నోముల గురించి ఒక పుస్తకము వ్రాసారు. మా పెద్దచెల్లి భలే బాగా పడుతుంది..
మా పక్కన ఆవిడ ఎంప్లాయీ అయినా ఆవిడకు భలే ఇంటరెస్టు.. కనీసం సంవత్సరానికి రెండు నోములు అయినా పడుతుంది..
ఇంతకీ మీరేం నోము పట్టారు??











No comments:
Post a Comment