Monday, October 5, 2020

మామ్మగారి ఊరు

 మామ్మ గారి ఊరు


పల్లెటూరు అంటే తెలిసింది మామ్మగారి ఊరే. ఊహ తెలిసినప్పటి నించి అదో స్వర్గం. ఎందుకంటే అక్కడ మామ్మ ఉంటుంది కాబట్టి. ఆఖరి పరీక్ష వ్రాసి రాగానే ఆ రోజు సాయంత్రమే ప్రయాణము.  మేము వెళ్లేటప్పటికి తాతయ్య కొబ్బరి తాడుతో దూలానికి ఉయ్యాల వేసి ఉంచేవారు. అందరిము టైం పెట్టుకుని ఊగాలి. చిన్నపిల్లలుకు తొట్టి వేసి ఊపేవారు. 


రాత్రి భోజనాలు అయ్యాక ఆరుబయట వరండాలో మంచాలు వేసుకుని కబుర్లు. మెల్లగా నిద్రలు. అమ్మ దగ్గర ఉంటే మేలుకొలుపులకి కూడా లెవనివారము అక్కడ పొద్దునే పక్షుల కిలకిలరావాలే మేలుకొలుపు. కొంచెం ఆలిశ్యము అయితే సూరన్న చుర చుర చూపులతో చూస్తాడుగా.

అయినా ముందు లేచిన వారికి ఒక అవకాశము. పొద్దునే వెళ్లి ఆచారిగారింటినించి పాలు తేవచ్చు. అక్కడ మన కళ్ళ ఎదురుకుండా పాలు పితికి ఇస్తారు. 

బారెడు జడలు ఉన్న అయిదుగురు ఆడపిల్లలు, మా తమ్ముడు, ఐదేళ్ల చిన్నది ఇది మా సైన్యం. పెద్దనాన్నగారి అమ్మాయిలు ఇద్దరు, మేము అక్కచెల్లెళ్ళము ముగ్గురు,బాబాయిగారి అబ్బాయి, అమ్మాయి ఇవి మా చుట్టరికాలు. టి.వి.లు,వీడియో గేములు, సెల్ ఫోన్లు లేకుండా అమ్మ నాన్న అన్న మాట ఎత్తకుండా రెండు నెలలు వుండే వాళ్ళము. 


పొద్దునే bournvita తాగి, దొడ్లో ఉన్న పూలు అన్నీ కోసుకువచ్చేవాళ్ళము. మా మామ్మ అన్ని మాలలు కట్టి మాకు పెట్టేది. ఎండ కాలము తాటి ముంజెలు, మామిడి పళ్లు. మధ్యాన్నం నిద్రగన్నేరు చెట్టు దగ్గరకు వెళ్లి మల్లెమొగ్గులు తెచ్చుకోవడము. బయటకు వెళ్తున్నప్పుడు దారిలో అందరూ పలకరించే వాళ్ళే. "ఎవరమ్మాయివి, అందరూ వచ్చారా అంటూ.

వెళ్లిన మర్నాడు గోరింటాకు పండుగ. గాజుల జిన్ను వచ్చి అందరికీ గాజులు వేసి వెళ్ళేవాడు. రెండు నెలలు చెక్కు చెదరకుండా ఉండేవి. ఆ రోజుల్లో మామ్మ గారి ఊరిలో మేమందరము అలాగా గడిపాము కాబట్టే ,ప్రతి పండుగకు అందరూ ఊరికి రావాలి అని మామ్మ పట్టుబట్టింది కాబట్టే ఈ రోజుకి మేము అందరమూ ఉమ్మడి కుటుంబముగా ఉన్నాము. ఒకరికి ఒకరు అనుకుంటున్నాము. 


మామ్మ పోయిన తొమ్మిదేళ్లకు మొన్న మళ్లీ మమ్మగారి ఊరు వెళ్ళాను. ఊరు మారిపోయింది. కొంచెం కొంచెం టౌన్ కళలు తెచ్చుకుంటోంది. మామ్మ గారి ఊరు మామ్మ లేని ఇల్లు లాగానే ఉంది.

No comments:

Post a Comment