Friday, April 5, 2019

ఉగాది పంచాంగం





ఉగాది పంచాంగం.
ఉగాది రోజు అందరము  పంచాంగశ్రవణం చేస్తాము కదా...ఆ రోజు టి.వి. చానెల్స్ అన్నీ వద్దన్నా వినిపిస్తాయి..
కేవలం సరదాగా నా పంచాంగ విశేషాలు చదవండి..
ఎవరికైనా గౌరవం ముఖ్యం కాబట్టి
ముందుగా అందరికీ రాజ్యపూజ్యం-అవమానం గురించి..
"నోరు మంచిదైతే ,ఊరు మంచిదవుతుందని"
మనకి మర్యాద ఇచ్చే లక్షణం ఉంటే, మనకు మర్యాద ఇస్తారు....అదే రాజ్యపూజ్యం....🙏
"నోరా వీపుకి తేకే "అని
తమలపాకుతో వారు ఒకటి అంటే, తలుపు చెక్కతో మీరు  ఒకటి అన్నారనుకోండి......మరి ఇంకా అవమానాలు కాక ఏమిటి??
అదే ఊపులో మీడియా,సోషల్ మీడియా లో పడ్డారనుకోండి...
ఇంక మీ పని,చెరుకురసం  మెషీన్ లో పడ్డ చెరుకుగడే..
.😥
ఆదాయ వ్యయాలు కు వస్తే...
మీకు పది రూపాయలు వచ్చినా మీరు తొమ్మిది రూపాయలు మాత్రమే ఖర్చుపెడితే...మీరు లక్షాధికారే...మీ ఆదాయం పెరిగే సూచనలు వున్నాయి..
అదే లక్ష రూపాయలు  వస్తున్నా, లక్షా ఒక రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టిన్నా....మీరు ఎల్లప్పుడూ వ్యయం లొనే వుంటారు..
అందుకే అవసరం లేని ఖర్చులకు రూపాయిని  రెండువేల రూపాయల నోటుగా భావించండి..
అవసరం ఉన్నచోట మాత్రము పదివేలను కూడా రూపాయి ఖర్చుపెట్టినంత ఈజీగా పెట్టండి...అప్పుడు బాధ ఉండదు..
వాతావరణం...🌞⛈️🌧️
సంవత్సరం లో పది నెలల ఎండాకాలము కు అందరమూ అలవాటుపడ్డాము..
ఇంకా మిగతా రెండు నెలల్లో వానలు కురవచ్చు....అయితే అవి తుఫానులో...సునామిలో కూడ అవచ్చు..
మనలో మన మాట...వర్షం రాకడ,ప్రాణం పోకడ ఎవరు అంత ఖచ్చితంగా చెప్పగలరు????😊
వ్యవసాయం-వాణిజ్యం-చదువు⛏️💸💹📕📒
దేశవాళి రైతు పండించే🌾 బియ్యం,పప్పులు,కూరగాయలు,పళ్ళు🍅🍎🌺 కొనుక్కుంటే రైతన్న బావుంటాడు..రైతన్న బావుంటే,దేశం బావుంటుంది..
చేతి పనులు వారిని ప్రోత్సహించండి.,
చేనేత వారికి ఊతం ఇవ్వండి..👚
స్వదేశీ వస్తువుల పై ప్రేమ, విదేశీ వస్తువుల పై మోజు తగ్గించుకుంటే వాణిజ్యం బ్రహ్మాండంగా సాగుతుంది..
చదువుకునే పిల్లల్లకు మార్కులు💯
కాలక్షేపం పిల్లకాయలకు  శున్యం0⃣
ఇంక రాశిఫలాల్లోకి వస్తే
మేష రాశి 🐏 వారు మేకల లాగా ఆకు కూరలు ఎక్కువ తింటే ఈ సంవత్సరం ఆరోగ్యానికి ఢోకా ఉండదు...
వృషభరాశి🐂  వృషభరాశి రాశి వారు కనిపించిన వారిని అందరిని కుమ్మకుండా మీ త్రోవలో మీరు వెళితే మార్గం సుగమముగా ఉంటుంది..
మిధునారాశి 👥దంపతుల మధ్య సఖ్యత లేకపోతే ఇంటికీ ,వీధికి తేడా ఉండదు..ఇంట్లో ఎవరి మాట ఎవరు విన్నా ఫర్వాలేదు కానీ మీ మాటలు రోడ్డు మీద వారికి వినపడకుండా చూసుకోండి..
కర్కాటకరాశి🦀కర్కాటకరాశి వారికి తా పట్టిన  పట్టు కాకుండా కాస్త జీవితములో పట్టు-విడుపు నేర్చుకుంటే ,జీవితము సామరస్యంగా సాగిపోతుంది..
సింహారాశి🦁  సింహారాశి వారికి ఈ సంవత్సరం జూలు విదిల్చిన సింహానికి మాల్లే వీరే రారాజులు.
తులారాశి ⚖️జీవితములో సమతుల్యం వీరు పాటించనంతగా మిగతవారికి రాదేమో...జీవితం అంటేనే అంత...అలాగే సాగిపోండి
కన్యరాశి🙎పరిస్థితులు ఎలా వున్నా,సుకుమారా కోమల భావాలను వడలనీయకండి..అంత ఆనందమయము అవుతుంది.
వృశ్చికరాశి🦂 ఎవరిని మాటల కాటు వేయకుండా,మీ పని మీరు చూసుకుంటూ,నొప్పింపక తానొవ్వక రీతిలో సాగిపోండి.
ధనురాశి🏹 గురి,గురుబలం ఉంటే శివధనస్సు ఎక్కుపెట్టిన రమాబాణం మీరేగా..
మకరరాశి🐊నీతమునిగిన,నేల పైన,ఇహమైన పరమైన ఆ దేవదేవుని నమ్ముకుంటే ఇంక మీకు తిరుగేది?
కుంభరాశి🍯 కుంభరాశి వారికి ఎల్లవేళలా కుంభానికి లోటు ఉండదు.తాము తినడమే కాక,పదిమందికి పెడతారు
మీనరాశి🐠ఆలోచనలలో,చేతల్లో చపలచిత్తం కూడదు..
స్థిరమైన నిర్ణయాల ద్వారా మీ లక్ష్యం తొందరగా చేరుకోగలుగుతారు.
ఏ రాశి వారైనా భగవంతుని నమ్ముకుని, మంచి ఆలోచనలతో,సత్సాంగత్యం తో ప్రశాంతంగా వుంటారు.
మంచి సమయము
మంచి పనులు చేయలనుకున్నప్పుడు ఎల్లవేళలా మంచి సమయమే..
అటువంటి వాటికి ఎక్కువ ఆలోచన కూడదు
"ఆలస్యం అమృతం విషం"అన్నారు పెద్దలు.
అందుకని వెంటనే చేసేయడము
మనకో,పక్కవాళ్లకో హాని,నష్టం కలిగించేవి ఉంటే అసలు చేయకపోవడం మంచిది.
లేదా కాస్త టైం తీసుకుని బాగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి,
ఇంట్లోకి బయటకు బాగా తిరిగి,కాళ్ళు నొప్పులు వచ్చాక ,
బాగా రెస్ట్ తీసుకుని,కప్పు కాఫీ లాగించి
అప్పుడు జొన్నవిత్తులవారి కాఫీ దండకం వినండి బావుంటుంది😊
అప్పుడు గట్టిగా దీర్ఘ శ్వాస తీసుకున్నాక   ....అప్పుడు మంచి సమయం.... ప్రశాంత చిత్తముతో ఇప్పుడు నిర్ణయం తీసుకోండి.
ఆగండాగండి...
నాకు తెలుసు మీ అందరూ  ఇప్పుడు రాబోయే ఎన్నికల ఫలితాల  కోసం ఎదురుచూస్తున్నారని....
ఎవరు గెలుస్తారు???
ఎవరికి బాగా ఓట్లు పడితే వారే గెలుస్తారు...
దేశానికి కావలి కాసేవారికి ఢోకాలేదు..
ఏదో  సరదాగా వ్రాసింది..
చదువుకుని ,నవ్వుకుని పండుగ బాగా చేసుకోండి..
అందరికి వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు.

Thursday, February 21, 2019

నీడ

ఆ రోజు - ఈ ప్రపంచానికి లభించింది

*******************

అనగనగ అప్పుడెప్పుడో

అనగనగా ఒక ఊరు

ఆ ఊళ్ళో ఒక కుర్రవాడు

అతని పేరు అనాతపుడు

చాలా మంచివాడు

చిన్నప్పుడే తలిదండ్రులను పోగొట్టుకున్నవాడు

యాయవారం చేస్తూ బతుకు వెళ్ళబుచ్చేది

భిక్షలో వచ్చినదానిలోనే తను కాస్త తిని మిగిలిందంతా ఆకలిగా కనపడ్డ కుక్కకు, పిల్లికి, తోటి భిక్షగాళ్ళకు పంచేవాడు

ఆ కుర్రవాడి మంచితనాన్ని చూచి, ఒక చెతి భిక్ష వేసే అమ్మలంతా రెండు చేతుల భిక్ష వేసేవారు

ఆ మంచితనం దేవలోకానికీ పాకిపోయింది

ఇంద్రుడికి ఆసక్తి కలిగి సంగతేమిటో తేల్చి తెలుసుకుందామని వచ్చినాడు

చాటుగా గమనించాడు, ఆశ్చర్యపడ్డాదు అతని దానగుణానికి

మాయరూపంలో వెళ్ళి చాలా ఆకలిగా ఉన్నదన్నాడు

అనాతపుడు తన జోలెలో ఉన్నదంతా తీసి ఇచ్చివేశినాడు

అంతా నాకిచ్చేస్తే నీకో అని ప్రశ్న వచ్చె దేవరాజు నుండి

అయ్యా మీ ఆకలి తీరితే చాలు, నా ఆకలి తీరినట్టేనని సమాధానం వచ్చింది

ముగ్ధుడైపోయినాడు రాజరాజు, దేవరాజు - ఇక ఆయన తలచుకుంటే కొదవేమి

వరమివ్వటానికి తయారయినాడు

అబ్బాయి - నీ మంచితనాన్ని మెచ్చినాను, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు

అయ్యా, మీరెవరు అని అడిగె అనాతపుడు

ఇందాక ఆకలి వేస్తున్నదంటే నాకు నీదగ్గరున2014ా ఇచ్చివేసినప్పుడు బిచ్చగాణ్ణి, నీ మంచితనం చూశాక ఆనందించాక ఇప్పుడు ఇంద్రుణ్ణి అన్నాడు

ఓ ఇంద్రులవారా అని ఒక నమస్కారం పెట్టి మరల తన భిక్షాటనకు బయలుదేరినాడు

ఆగు - అలా వెళ్ళిపోతావేమిటి ? వరం వద్దా? అంతా దానం చేసినావుగా అనె ఇంద్ర

అయ్యా, అది దానమని నేననుకోవటల్లేదు, తోటి మనిషి ఆకలితో అలమటించి పోతుంటే నేను చేయగలిగిన చిన్న సాయమనుకున్నాను అన్నాడు అనాతపుడు

అది దానం కిందకే వస్తుంది, నీకు ఋణగ్రస్తుడనైపోయినాను. అందువల్ల వరమిచ్చేసి తీర్చేసుకోవాలి అన్నాడు దేవరాజు

నాకేమీ అక్కరలేదు అనె అనాతపుడు

కాదు కాదు నువ్వు వరం కోరుకోవాల్సిందే అని ఇంద్రుడు స్వరము పెంచినాడు

అయ్యా అంత కోపమెందులకు, సరే మీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి - నాకు నేను చేస్తున్నాననే విషయం తెలియకుండానే ప్రపంచంలో అందరికీ మేలు చెయ్యగలగాలి - అది ప్రసాదించండి చాలు అని నమస్కారం పెట్టినాడు

ఇంద్రుడికి అట్లాటి వరం ఎలాగివ్వాలో అర్థం కాలా

పంచభూతాలను పిలచినాడు, అష్టదిక్పాలకులను పిలచినాడు

దర్బారు పెట్టినాడు

సంగతి చెప్పినాడు

అరె ఇది చాలా చిక్కుగా ఉన్నదని అంతా తర్జనభర్జన పడినారు

ఇంతలో సూర్యుడు వచ్చినాడు

సంగతి చెప్పినారు

ఆయనన్నాడు - ఇది చాలా సులభంగా పరిష్కరించొచ్చయ్యా, ఇదిగొ ఇలా చెయ్యండి అని వెళ్ళిపోయినాడు

ఇంద్రుడు ఇదేదే బాగుందని అలాగే వరమిచ్చి వెళ్ళిపోయినాడు

ఆ రోజు మొట్టమొదటి "నీడ" ఈ ప్రపంచానికి లభించింది

ఇంతకీ సూర్యుడన్నదేమంటే - ఆయనకు ఓ నీడను జతచెయ్యండి. ఆయనకు కాకుండా ఆ నీడకు అన్ని శక్తులిచ్చెయ్యండి. ఆయన నీడ పడగానే ఆ నీడ పడ్డ ప్రాణిగాని, వస్తువుగాని - దాని దుఖాలు, క్లేశాలు, కష్టాలు, కన్నీళ్ళు నాశనమైపోయేట్టు వరమిచ్చెయ్యండి అని

తన నీడతో అనాతపుడు తనకు తెలియకుండానే ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేసి ఈ లోకం విడిచి వెళ్ళిపోయి స్వర్గంలో ఇంద్రుణ్ణి కలుసుకొని - అయ్యా, నేనొచ్చేసాక, మంచి పనులన్నీ ఆగిపోయినాయి, నాకిచ్చినట్టే మనుషులందరికీ నీడను జత చెయ్యండి. అంతా మంచే జరుగుతుందని ప్రాధేయపడి మొత్తానికి మనుషులందరికీ నీడ జత చేయించినాడు

-- ఆ మంచి చేసే రోజుల నుంచి ఈరోజు తన నీడను చూచి తనే భయపడే స్థాయికి వచ్చేసిన మానుష జాతికి అనాతపుడి అవసరం ఎంతో ఉన్నది...
-- అనాతపము అన్న పదం నీడకు ప్రత్యామ్నాయంగా ఒక పిట్టకథలో వాడినాక వచ్చిన ఆలోచనతో రాసుకొన్న మరొక పిట్ట కథ
-- ఫిబ్రవరి 17, 2014By Vamsi maganti

విధి

గంటలు మోగిపోతాయ్, ఆ తర్వాత బద్దలైపోతాయ్

*********************

అనగనగ

అనగనగ ఒక ఊరు

ఆ ఊళ్ళో ఒక తాత, ఒక మనవడు

తాత ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమారాది విద్యల్లో దిట్ట

కుర్రవాడు కాస్త పెద్దగయినాక ఇంద్రజాల విద్యను నేర్పినాడు

కుర్రవాడు అందిస్తే అల్లుకుపోయేవాడు కావటం వల్ల బాగా నేర్చుకున్నాడు

ఇద్దరూ కలిసి ఆ విద్యలతో కాలం గడిపి డబ్బులు బాగా సంపాదించారు

డబ్బులతో పాటు సుఖాలు భోగాలు అలవాటయినవి

కాలం పరుగులు తీస్తున్నది

ముసలి తాత మరింత ముసలి అయినాడు

ఈ లోకాన్ని విడిచే రోజు దగ్గరకొచ్చింది

జబ్బు పడ్డాడు

యముడు వచ్చే సమయం ఆసన్నమయ్యింది

అది చూచి మనవడు దిగులుపడ్డాడు

తాతా నువ్వు నన్ను వదిలివెళ్ళటానికి లేదు, నీ సంగతి నే చూసుకుంటానని యమధర్మరాజుని బురిడీ కొట్టిచ్చటానికి ఉపాయం పన్నినాడు

ఇంద్రజాలంతో ఊళ్ళోని ఒక ఇరవైమంది తాతలను తన తాతలా కనపడేట్టు చేసినాడు

సమయం వచ్చినది

యమధర్మరాజు వచ్చినాడు

ఒక్క సారిగా ఒకే రూపంలో ఉన్న ఇరవైమందిని చూసి ఆశ్చర్యపడినాడు

ఎవరిని తీసుకొనిపోవాలో ఒక నిమిషం అర్థం కాలా ఆయనకు

ఇదేమి గొడవరా నాయనా అనుకుంటూ ఆ మహాదేవుడి వద్దకు పరుగులిడినాడు

ఆయన అటు, ఈ మనవడు బయటకు విజయగర్వంతో నడచినారు

యముడు మహాదేవుడి పాదాల వద్ద కూర్చొని సంగతి చెప్పి ఏం చెయ్యాలో తోచట్లేదని బావురుమనినాడు

బిడ్డా, ఏడుపు ఆపుము, నీవు చేయవలసినది ఇది అని మహాదేవుడు యముణ్ణి కిందకు పంపించినాడు

మహిషపు గంటలు వినపడగానే తాతకు మరల పై ప్రాణాలు పైనే పోయినాయ్

ముసలోళ్లందరినీ గుంపు చేసేలోపల వచ్చేశాడు యముడు

మొత్తానికి ఇరవైమంది ముసలోళ్ళు ఓ చోట నిలబడినారు

యముడు చిరునవ్వు నవ్వినాడు

నవ్వి ఇలా అనినాడు - తాతా, చాలా తెలివి కలవాడివి. కానీ ఒక్క విషయంలో పొరబడి తప్పు చేశినావు. అదే ఇప్పుడు నిన్ను పట్టించింది అని

ఆ తప్పు పొరబాటు చేశినాను అన్న మాట వినగానే అసలు తాత గబగబ దేక్కుంటూ బయటకు వచ్చి ఏమిటా తప్పు అనినాడు

ఇదే, ఈ బయటకు రావటమేనని - గంట వాయించి ముసలివాడిని లాక్కొనిపోయినాడు

అలా విధిని, ధర్మాన్ని మోసం చెయ్యాలని చూస్తే - గంటలు మోగిపోతాయ్, ఆ తర్వాత బద్దలైపోతాయ్

ఓం తత్ సత్

-- మార్చి 21, 2014
-- forwarded

Friday, February 15, 2019

ఉగ్రవాదం

ఉగ్రవాదం
వీర్రాజు ఒక బిల్డర్ దగ్గర సూపరువైసరుగా పని చేస్తున్నాడు.వర్కర్లు ఎంత మంది వచ్చారు, వారు రోజు ఏమి పని చేస్తున్నారు,కూలి బట్వాడా అతని పనులు.

ఒక రెండు సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి.ఏడాది పాప. ప్రస్తుతం చేస్తున్న సైటు దగ్గరే వసతిగా ఇల్లు దొరకడముతో ఈ కొత్త ఇంటికి మారి ఆరు నెలలు అయ్యింది.

మాములుగా బాధ్యతగా ఉండి తన పని చూసుకుని ఇంట్లో భార్య పిల్లలతో కాలక్షేపం చేసేవాడు.

ఎప్పుడైనా స్నేహితులు బలవంతం మీద సారా తాగేవాడు. అటువంటివాడిలో గత నాలుగు నెలలుగా మార్పు గమనించింది అతని భార్య చంద్రిక.

అంతకుముందు అడపాదడపాగా ఉన్న అలవాటు ఇప్పుడు ఇంచుమించి రోజుగా మారింది.

రెండు నెలలుగా ఇంట్లో జీతం ఇవ్వడం లేదు.
 జాగ్రత్తగా వుండే మనిషి కాబట్టి తన దగ్గర దాచిన డబ్బుతో ఇల్లు నడుపుతోంది. కానీ జీతం ఏమి చేస్తున్నాడు అని ఒక రోజు అడిగితే ఇంకా రాలేదు అని సమాధానం చెప్పాడు.

వారం రోజుల నించి మధ్యాన్నం భోజనానికి వచ్చినప్పుడే మనిషి దగ్గర సారా వాసన వస్తోంది.
ఇంక చెప్పక్కర్లేకుండానే జీతం ఏమౌతుందో చంద్రికకు అర్ధం అయింది. నయాన నచ్చచెప్పింది..పిల్ల ఉన్నది,ఇల్లు ఒళ్ళు గుల్ల అవుతుంది.వద్దని.
నిజమే...ఇంకా తాగను అని ఒప్పుకున్నాడు వీరాజు..
కానీ షరా మాములు..మధ్యాన్నం తాగి వస్తున్నాడు.
అదేమి అంటే ఆ కల్లు కాంపౌండ్ కి వచ్చేదాకా బానే ఉంటున్నా...అక్కడికి వచ్చే సరికి కాళ్లు ఆటు వెళ్లిపోతున్నాయి అన్నాడు..

అసలు ఇంతలాగా అలవాటు ఎందుకు అయ్యింది అని నిలదీస్తే..
ఎన్నికల హడావిడిలో నెలరోజులుపాటు తాగినవాళ్ళకి తాగినంత పోయించారు నాయకులు...
అప్పుడే అది వ్యసనమై నెత్తి మీద మహమ్మరి అయ్యింది..

నెత్తి నోరు కొట్టుకు చెప్పింది...
కల్లు కాంపౌండ్ దారి కాక వేరే దారిలో వస్తానన్నాడు...జీతం ఇంటికి తెస్తానన్నాడు
నిజమని  నమ్మింది వెర్రిది..
మళ్ళీ మధ్యాహ్నం తాగివచ్చాడు..
జీతం ఏది అని అడిగింది..
సారకొట్టు వాడి బాకీ జమ వేశానన్నాడు
కోపం వచ్చింది చంద్రికకు...
పుట్టింటికి పోతా అంది...
పోతే పో..అన్నాడు
మళ్ళీ రాను అన్నది..
అక్కడే చావు అన్నాడు.
ఇక్కడే చస్తా అన్నది
చావు...బెదిరిస్తున్నవా అని ఎగతాళి చేసి మత్తుగా పడుకుండిపోయాడు వీర్రాజు..
ఆవేశం,ఉక్రోషం పట్టలేక కిరసనాయిలు పోసుకుని నిప్పు అంటించుకుంది చంద్రిక.
అప్పుడే నిద్ర లేచిన ఏడాది పాప అమ్మను వెతుక్కుంటూ వెళ్లి కాళ్ళను పట్టుకుంది...
గుర్తొచ్చిన పేగుబంధం కేకలు పెట్టింది..వీర్రాజు కి ఇంకా మత్తు వదలలేదు..
పక్కింటివారికి కేకలు వినపడి,వచ్చి  నీళ్లు గుమ్మరించేటప్పటికి పాప లేత చర్మం అంటుకుపోయింది.
ఇంకో బకెట్ నీళ్లు వీర్రాజు మీద గుమ్మస్తే మత్తుదిగింది.

వాస్తవం లోకి వచ్చేటప్పటికి పసిపాప మోర్చురీ లో,
 కోరి చేసుకున్న భార్య ఐ.సి.యూ.లో...
పోలీస్ వచ్చి ఎఫ్.ఐ.ర్. వ్రాయబోతే. స్టవ్ పేలింది అని వాంగ్మూలం ఇచ్చింది..
పిచ్చి తల్లీ...

ఈ చిచ్చు ఎవరు పెట్టింది?
ప్రభుత్వాలు తమ ఆదాయం సారకొట్లు పెట్టటము,
నాయకులు తమ ఓట్ల కోసం వీళ్ళని మత్తులో ముంచడం
జీవితాలు కొల్పుతున్నా తెలుయని నిర్భాగ్యులు...
ఇది ఏ  ఉగ్రవాదం కన్నా తక్కువ???
దేశములో జవాన్లు ప్రాణాలైనా,పేదవాడి ప్రాణాలైన నాయకుల చేతిలో బలి కావలసిందేనా???

(ఇవాళ జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా వ్రాసింది)

Tuesday, February 12, 2019

రధసప్తమి 2019

I AM NOT COMING TODAY EVENING BECAUSE OF I VENT TO YADADRI TEMPLE I WILL COME TO MARROW MORNING -నిన్న సాయంత్రం వచ్చిన మెసేజ్..మొదలు కోపం వచ్చినా I will come tomorrow morning...అన్న మాటలు రేపటి ఉదయం గురించి ఆశ నింపింది పొద్దున్నే వుండే హడావిడికి తోడు రధసప్తమి ... మనం మర్చిపోకున్నా...అందరూ రధసప్తమి శుభాకాంక్షలతో గుర్తు చేసేశారు... వారి స్ఫూర్తి, నిన్నటి ఆశ తో ఉత్సహం గా శుభోదయం...
5.30....తలుపు తట్టిన శబ్దం రాలేదు... రాత్రి లేట్ అయ్యిందేమో . 6.30...పక్కింటికి వెళ్లి వస్తుందేమో ఆమె ఎంప్లాయీ కదా... 7.00...పిల్లకోసం పెడ్తూ,వేడి వేడి ఇడ్లిలు కూడా వేసి రెడి పెట్టా, రాగానే తింటుంది.. 7.20....ఆటో వచ్చింది..అమ్మాయి స్కూల్ కి వెళ్ళింది.. 7.30... ఇడ్లిలతో పాటు ఉత్సహం చల్లారగా, ఆశ చావక ఫోన్ చేశా...ఎప్పటిలానే 'అందుబాటులో లేరు' అదేమిటో మన ఇంట్లో వున్నప్పుడు తెగ ఫోన్లు వస్తూవుంటాయి....మనం అవసరమై చేసినప్పుడు "ఒకే మాట-ఒకే బాణం' టైప్ లో వినపడుతోంది
7.32.. ఇప్పుడే అమ్మాయిని స్కూల్ పంపించి కష్టపడ్డాను కదా,రిలాక్స్ అవుదామని ఇంస్టాగ్రామ్ తెరిచా
7.33..."సాహసమే చేయరా ఢింబక " అని బాలుగారి గొంతు ఉద్భోధ(అది నా ఫోన్ రింగ్ టోన్)..
ఫోన్ తీసా...ఒక మగ గొంతు.. ."అమ్మా,సాయంత్రం వస్తుందమ్మా," "అదేంటి ఇవాళ పండుగ,పైగా పరీక్షలు ,రోజూ రమ్మని చెప్పానే" "అవున్నమ్మ,మీరు చెప్పారట...కానీ ఫంక్షన్ కి వచ్చి ఉండిపోయాము ,సాయంత్రం వస్తుంది" అంతే ఫోన్ కట్ అయ్యింది. నాకు ఆవేశం కట్టలు తెంచుకుంది...😬
ఫోన్ స్క్రీన్ వేపు చూస్తే కనపడింది ఇది...👇కింద బొమ్మ చూడండి😥 Yes, Peace Peace🕊️  అని బుద్ధిగా లెంపలు వేసుకుని,
అందుకేనెమో ఓంకారన్నయ్య' సిక్స్త్ సెన్స్' లాగా నా సిక్స్త్ సెన్స్ కూడా నిన్నటి నించి "రేపు కాలేజ్ కి వెళ్లకు" అని ఒకటే పోరు.
ఈ బాధ,కసి,కోపం ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు....అందుకే మార్క్ నే ఇచ్చాడు గోడ ఒకటి, ఇంకా నాకేల....అని నా గోడుని గోడ ఎక్కించి..
కాసేపు సూరయ్యని ఆగమని (మాకు ఇంకా మబ్బుగా ఉంది😊) వేడుకుని రెడిగా పెట్టుకున్న నాయనమ్మ కుంపటి,అమ్మ ఇచ్చిన ఇత్తడి గిన్నె కాసేపు పక్కన పెట్టి స్వచ్చ్ భారత్ చేసుకుని... మళ్ళీ రధసప్తమి వేడుకల తో వస్తానే... అన్నట్టు మీకు కూడా రధసప్తమి శుభాకాంక్షలు😃
మా P.M. అదే మా పనిమనిషి గుడ్ గర్ల్ లాగా సాయంత్రం వచ్చేసింది.
కానీ పొద్దున్న నిదోరోతున్న నా ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపింది...ఆమె మీద నేను ఆధారపడి లేను..అవసరమైతే నా ఇంటి పని నేను చేసుకోగలను అని. ఇక రధసప్తమి గురించి...
రధసప్తమి అనగానే నాకు గుర్తువచ్చేది ఆకాశం ఏమాత్రం కనపడని విజయవాడ వన్ టౌన్ లోని మా ఇంట్లో దొడ్లో కుంపటి పెట్టి దాని మీద సంక్రాంతి కి పెట్టిన గొబ్బి పిడకలు పెట్టి పాలు పొంగించి చిక్కుడు ఆకులలో పరమాన్నం నైవేద్యం పెట్టేది. నాకు రధసప్తమి అంటే ఎందుకో చాలా ఇష్టము.
ఈ రోజు పాలు పొంగించడం కోసమే నేను మా నాయనమ్మ దగ్గర కుంపటి తెచ్చుకున్నా..
మా అమ్మ ఇచ్చిన ఇత్తడి గిన్నె,నందిని వారి ఆవుపాలు, సిద్ధం చేసుకున్నా.
కుంపటి అంటించి ,దానిని మళ్ళీ ఇలాంటి విసనకర్ర తోనే విసరాలి...దానికి కర్ర ఉండకూడదు..అప్పుడే చిన్నప్పుడు పెరవల్లో కుంపటి ఫీలింగ్ వస్తుంది.
పాలు మూడుసార్లు పొంగించి, ఇంట్లో అందరి పేర్లు చెప్తూ బియ్యం వేసి,పరమాన్నం చేసి వాటితో పాటు పొట్టు మినప్పప్పు గారెలు నైవేద్యం పెట్టా.. పాలు పొంగించడములో మనం స్పెషలిస్ట్ కదా.
అందులో బాగా ఎక్స్పర్ట్ అయ్యి కిటుకులు తెలిసి లీటర్ పాల గిన్నెలో అర లీటర్ పాలు పెడతా... అప్పుడు పాలు మరుగుతాయి కానీ పొంగవు అన్న మాట.
పొంగిన పాలు,పొయ్యి,గట్టు తుడుచుకోవడం కన్నా పాలు కోవ అవడం బెటర్ కదా..
ఎప్పుడూ పొంగపెట్టే పాలు ఈ రోజు ఆఫీషల్ గా పొంగిచవచ్చు😛అందుకే నాకు రధసప్తమి అంటే ఇష్టం. పాలు పొంగించాక ఆ కుంపటి మీద టీ పెట్టాను. ఏడాది కి ఒక రోజు ఇలాగ...చాలా బావుంటుంది ఇలాగా నెమ్మదిగా మరిగిన టీ. కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి..
ప్రపంచమంతా తన కాంతిని ప్రసారింపచేసి మనల్ని కాచే దేవుడు.
మన కోసం మనం ప్రార్ధించుకుంటూ "లోకాసమస్త సుఖినోభవంతు" అంటూ ఆ పాలు పొంగినట్టు అందరికి సుఖసంతోషాలు వెల్లివిరియాలని ప్రార్ధిస్తున్నా
రధసప్తమి నోములు 
రధసప్తమి నాడు నోములు పడతాము..ఆ రోజు కుదరకపోతే శివరాత్రి నాడు పడతారు.
పెళ్లయిన కొత్తలో పూతాంబూలం, పండుతాంబూలం,పదహారు ఫలాలు నోము పట్టాను.
పూర్తి చేశాను.
అనుకోకుండా కైలాసగౌరి నోము,గ్రామ కుంకుమ నోము చేసుకునాను.
ఆ తరువాత ఆరోగ్యం బావుండక ఇంకేమి ఏమి నోము పట్టలేదు.
మా అమ్మ చాలాసార్లు చెప్పింది" చిన్న చిన్న నోములు పట్టుకో "అని
కానీ అసలే కుదురు తక్కువ..పైగా ఆరోగ్యం బావుండకపోవడంతో ఒకటే నిర్ణయిచుకున్నా..
అదే మా అమ్మకు చెప్పా...
"నా పిల్లలు ఇద్దరు బాగా చదువుకుని మంచిగా జీవితంలో స్థిరపడితే అదే పెద్ద నోము"అని. అప్పుడు పరిస్థితి అది.
గడపలోకి వచ్చినవారిని సరిగా చూసుకుంటే అదే పెద్ద నోము అనుకుంటున్నాను. Kamala Parachaగారు తను పట్టిన నోముల గురించి ఒక పుస్తకము వ్రాసారు. మా పెద్దచెల్లి భలే బాగా పడుతుంది..
మా పక్కన ఆవిడ ఎంప్లాయీ అయినా ఆవిడకు భలే ఇంటరెస్టు.. కనీసం సంవత్సరానికి రెండు నోములు అయినా పడుతుంది..
ఇంతకీ మీరేం నోము పట్టారు??
Disclaimer: The opinions expressed in this post are the personal views of the author. They do not necessarily reflect the views of Momspresso.com (formerly mycity4kids). Any omissions or errors are the author's and Momspresso does not assume any liability or responsibility for them.









Wednesday, January 9, 2019

అమ్మ చేతి ముద్ద

అమ్మ చేతి ముద్ద...

నాకు ఊహ తెలిసినప్పట్టి నించి పొద్దునే అన్నం తినడం అలవాటు. ముఖ్యంగా అన్నం తిని స్కూల్ కి వెళ్ళేవాళ్ళము..ఎప్పుడైనా ఆదివారమునాడు ఇడ్లి పొద్దున్న టిఫిన్ పెట్టేవాళ్ళు...
అప్పట్లో పొద్దునే తినే భోజనాన్ని బ్రేక్ ఫాస్ట్ అంటారు అన్న ఫార్మాలిటీస్ లేని రోజులు.
అసలు breakfast కి రైస్ తింటారా అని ఆశ్చర్యపోతారు ఇప్పటి పిల్లలు.

మా అమ్మ మొదట్లో నేను ఒక్కదాన్నే స్కూల్ కి వెళ్ళేదాని కాబట్టి ఒక చిన్న స్టీల్ గిన్నెలో వేడిగా అన్నం వండి ఉసిరికాయ,చింతకాయ, మాగాయి,గోంగూర,కందిపొడి,కారప్పొడి,అల్లపచ్చడి లాంటివి కలిపి నెయ్యి వేసి పెట్టి,ఆ తరువాత పెరుగన్నం కలిపి పెట్టేది.

తరువాత మా చిన్న చెల్లి కూడా స్కూల్ చేరాక  గిన్నె పెద్దద్ది అయ్యింది. మా మామ్మ దగ్గర వుండే పెద్ద చెల్లి 6th క్లాస్ లో  విజయవాడ వచ్చి, ఇక్కడ  స్కూల్  లో చేరాక ముగ్గురికి కలిపి పెద్ద ఇత్తడి గిన్నె లో వండేది.

మా నాన్న వాళ్ళ అమ్మమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి ఉండేది. అప్పుడు పొద్దున పూట ఆవిడ కలిపి పెట్టేది.

మా మామ్మ వస్తే ,మామ్మ ఉన్నన్ని రోజులు ఆవిడే కలిపి పెట్టాలి.
అన్నం వద్దు అన్న వాళ్ళని  కూడా " ఆఖరి ముద్ద అమృతం" అంటూ చివరిదాకా తినేలాగా చేసేది.
అప్పుడు అందరికి ఆఖరి ముద్దే కావలసి వచ్చేది.
  అంతే గిన్నె ఖాళీ.
"కూర్చోపెట్టి పెడితే కుంభాలు ఖాళీ అవుతాయి. " అనేది.

మా నాన్న పొద్దునే ఊరికి వెళ్ళవలసి వస్తే మాతో పాటు రెండు ముద్దలు తిని వెళ్లిపోయేవారు.

మేము పెద్దపిల్లలు అయ్యాక మా మామయ్య కొడుకు స్కూల్ ఫైనల్ అయిపోయి ఖాళీగా ఉన్నాడని మా ఆఫీస్ కి వచ్చేవాడు. మా ఇంటి ఎదురుగానే ఆఫీస్ ఉండేది. కారియర్ మా ఇంట్లో పెట్టుకుని ఆఫీస్ కి వెళ్ళేవాడు..
మేము ఆ కారీయర్ మూత తీసి మాకు నచ్చిన.కూరో పచ్చడో ఉంటే అది వేసుకుని అన్నం తినేసి స్కూల్ వెళ్లిపోయేవాళ్ళము.  మా అమ్మ తను వండింది మధ్యాహ్నం మా బావకు వేసి భోజనం పెట్టేది.
చింతకాయ బెల్లము వేసి నూరేది మా అత్తయ్య-ఎంత బావుండేదో..
కొబ్బరి పచ్చడి,నువ్వుల పొడి ఎంత బాగా చేసేదో.

వేసవి కాలం సెలవుల్లో కూడా అంతే మా అమ్మ ,పెద్దమ్మ దగ్గరో ఉంటే మా అక్కలకి(పెదనాన్నగారి పిల్లలు) మాకు ముద్దలు కలిపి అన్నం పెట్టేసేవారు. అది తినేసి నేను మా చిన్నక్క చెరో నవల అద్దెకు తెచ్చుకుని నేల మీద  ఒక దిండు వేసుకుని ఒక వైపు అది,ఒక వైపు నేను పడుకుని మధ్యాహ్నం కల్లా ఆ నవల చదివేసి,మాలో మేము పుస్తకం మార్చుకుని సాయంత్రానికి ఇద్దరమూ రెండు నవలలు చదివేసేవాళ్ళము. లెండింగ్  లైబ్రరీ లో ఒక నవల కి రోజుకి అర్ధ రూపాయి. మేము సాయంత్రం  వెళ్లి  ఒక రోజుకి అర్ధ రూపాయి కదా,మేము సాయంత్రానికి తెచ్చి ఇస్తున్నాము ఇంకో పుస్తకం ఇచ్చి రేపటికి అర్ధరూపై తీసుకో అని బేరం ఆడి ఇంకో నవల తెచ్చుకునేవాళ్ళము.
ఇంట్లో ఒకటి రెండో రోజులు చూసి అమ్మ వాళ్ళు ఫుల్ క్లాస్ పీకేవాళ్ల్లు అప్పుడు జోరు తగ్గేది.

కానీ సెలవుల్లో మా మామ్మగారి ఊరు వెళ్తే అప్పుడు.పొద్దున్నే అన్నం కాదు.
మేము కజిన్స్ అందరం- ఏడుగురు అక్కచెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు. రోజుకి ఒకరి ఛాయిస్. పూరి,పరమాన్నం,బొబ్బట్లు,గారెలు,దోసెలు,ఉప్మా ఇలా ఎవరికి ఏ పిండి వంట కావాలంటే అది పొద్దునే తినేయటం.మధ్యాహ్నం భోజనం

మా పెద్ద బాబాయ్ మాత్రం పిల్లలకు పొద్దునే అన్నం పెడితే మొద్దుబారిపోతారు అనే వాడు. కానీ మా ఇంట్లో మా అమ్మవాళ్ళు వినేవారు కాదు. పైగా మాకు అలవాటు చేసేసారు. ఇప్పటికీ పొద్దున్న ఎనిమిది గంటలకల్లా ఆకలి వేస్తుంది.

మా పిల్లలకు కూడా నేను పొద్దునే అన్నం తినడమే అలవాటు చేసాను. వాళ్ళు పొద్దున తిని వెళితే ఇంకా స్కూల్ ఒక్కోసారి తినకపోయినా సాయంత్రం దాకా కాస్త ఓపిక ఉంటుంది. నన్ను చాలా మంది అడిగేవారు  మీ పిల్లలు ఎలా తింటారు? మా పిల్లలు తిన్నారు అని. ఇంక కొంతమంది పిల్లలు అసలు breakfast చేయకుండానే స్కూల్ కి వెళ్లి పోతారట...

నేను సాయంత్రం తొందరగా 7గంటల లోపు అన్నం పెట్టేసేదాన్ని. వాళ్ళు ఆకలి అంటే రాత్రి ఒక గ్లాస్ పాలు తాగి పడుకునేవాళ్ళు. పొద్దున్నే ఆకలి ఎందుకు వెయ్యదు?
ఇప్పుడు అంత ఫాషన్..అతి.ప్రేమలు
పిల్లలకి రాత్రి.10గంటల కి పెద్దవాళ్ళతో పాటు పెడతారు.
ఇంక పొద్దున్నే ఏమి తినగలుగుతారు వాళ్ళు?

నేను ఇప్పటికి ఏ exam రాయడానికి వెళ్లినా శుభ్రంగా కొంచెం పెరుగన్నం తిని వెళ్తా..
ఏమి చేస్తాం.
అమ్మ చేతి ముద్ద అలవాటు..అంత మంచే జరుగుతుంది.



Sunday, January 6, 2019

Creative

ఇవ్వాళ నా creative skills గురించి చెప్పకుండా వుండలేను-మీరు వినక తప్పదు. మాములుగా వంట ఎవరైనా చేస్తాము. కానీ    creativity చూపించేది అంతా రెండు సందర్భాలలొా.
1.కొత్త ప్రయొగం మనం అనుకున్నట్లు కాక అది అనుకున్నటు వచ్చినప్పుడు. వాటిని రిపేరు చేసేటప్పుడు నా బుర్ర కి భళే సరదా.
2.ఏమైనా వంటకం మిగిలినప్పుడు. leftovers కి Make over చేసినప్పడే .అయితే ఏమి చేసిన తినే పదార్థం పారవేయకూడదు అనే ఆలొచన  తప్ప మిగలినవి/ మిగల్చి చేయాలని దురద్దేశం లేదని గమనించ మనవి.
అయితే ఇవాళ పాకము గురించి చెప్పె ముందర -మా ఇంట్లొ ఉప్పు బాగా తక్కవ వాడతాము. అందు కని బండపచ్చడి ఒక పూట ,మహ అయితే ఒక రొజు మించి తినరు. మొన్న చేసిన బీరకాయ పచ్చడి నిన్న కార్తీక పౌర్ణిమ ఉపవాసము వలన తినలేదు. మరి దాన్ని ఏమి చేయవలె.పొద్దున్నే మెరుపు లాంటి ఆలొచన వచ్చింది.కందిపప్పు కుక్కర్ లొ ఉడికించి,టమాట కొసి పొపు లొ వేసి,అవి మగ్గిన తరువాత బీరకాయ పచ్చడి కలిపా. తరువాత ఉడికిన పప్పు కలిపి ఉప్పు కారం వేశా. పైన కరివేపాకు,కొత్తిమీర చల్లా.
మా అమ్మాయి నా వంటకాలకి taster. "బావుంది అమ్మ, మసాల పప్పులా వుంది" అంది. చాలు నాకు AGMARK ముద్ర పడినట్లే
p.s. నా experiments ని తిని encourage చేస్తున్న మా ఇంట్లొ వాళ్ళకి,  వాళ్ళ ఇంట్లొ వంట ప్రయొగం చెడినప్పుడల్లా నా సలహా కొసం సంప్రదించేే నా బంధుమిత్రులు నా కళను పెంపొందించిన అవకాశం ఇచ్చిన వారు  -వారికి నా Thanks.